సిద్ధరామయ్యకు విశ్రాంతి..
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మోకాలి నొప్పి కారణంగా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటోన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ధారించింది. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపింది.
గతంలో సిద్ధరామయ్య ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఆ నొప్పి ఇప్పుడు తిరగబెట్టింది. మోకాలి లిగమెంట్ సర్జరీ జరిగిన చోట ఒత్తిడి పడటం వల్ల గాయం రేగింది. ఫలితంగా- నడవడానికి ఇబ్బంది పడ్డారు. అధికారిక నివాసంలో డాక్టర్లు ఆయనకు పరీక్షలను నిర్వహించారు. వారి సూచనల మేరకు మణిపాల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఆసుపత్రిలో సిద్ధరామయ్యకు వైద్య పరీక్షలను నిర్వహించారు. మోకాలికి స్కానింగ్ తీశారు డాక్టర్లు. లిగమెంట్ సర్జరీ మీద ఒత్తిడి పడటం వల్ల నొప్పి తీవ్రమైనట్లు వెల్లడించారు. ఆయనకు మరే ఇతర అనారోగ్య సమస్యలు లేవని, రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య పాల్గొనాల్సి ఉన్న అన్ని అధికారిక కార్యక్రమాలను కూడా రద్దయ్యాయి. ఈ రెండు రోజుల్లో సిద్ధరామయ్య పాల్గొనాల్సిన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, జిల్లా పర్యటనలను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రెండు రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారని పేర్కొంది.
నేడు ఆయన దక్షిణ బెంగళూరు (రామనగర), చిక్‌బళ్లాపుర జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కొన్ని శంకుస్థాపనలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. సోమవారం నాడు తన అధికారిక నివాసంలో సమీక్షా సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. అలాగే- కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండగా అవి రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications