శ్రీరాములుపై బీజేపీ ఎమ్మెల్యే తిరుగుబాటు, సీఎం సిద్దూతో భేటీ, తేల్చేసిన సిద్దూ, సమయం!

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే 218 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఒకే సారి విడుదల చేసింది. టిక్కెట్లు రాకపోవడంతో అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై మైసూరులో సీఎం సిద్దరామయ్య స్పందించారు. టిక్కెట్లు దక్కకపోవడంతో సర్వసాదారణంగా అసంతృప్తి, నిరసన వ్యక్తం చేస్తారని, వాటిని తాను సరిదిద్దుతానని సీఎం సిద్దరామయ్య అన్నారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు మీద తిరుగుబాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు.

ఆంధ్రా సరిహద్దు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి చివరి వరకు ప్రయత్నించిన వీఆర్. సుదర్శన్ చివరికి టిక్కెట్ దక్కకపోవడంతో కేపీసీసీ పదవికి రాజీనామా చేశారు. వీఆర్. సుదర్శన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీఆర్. సుదర్శన్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లరని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీ కుమార్తె
కోలారు శాసన సభ నియోజక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ సభ్యుడు కేహెచ్. మునియప్ప కుమార్తె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కోలారులో ప్రస్తుతం స్వతంత్ర పార్టీ అభ్యర్థి వర్తూరు ప్రకాష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండుసార్లు వరుసగా వర్తూరు ప్రకాష్ అదే నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అయ్యారు.

శ్రీరాముల మీద పోటీకి !
మళకాల్మూరు నియోజక వర్గం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, శ్రీరాములు మీద తిరుగుబాటు చేసిన ఎస్. తిప్పేస్వామి మంగళవారం సీఎం సిద్దరామయ్యను కలిశారు. మాళకాల్మూరు నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని తిప్పేస్వామి సీఎం సిద్దరామయ్యకు మనవి చేశారు.

సమయం మించిపోయింది
తిప్పేస్వామి టిక్కెట్ విషయంపై సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే సమయం మించిపోయిందని, మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో డాక్టర్ బి. యోగేష్ బాబుకు టిక్కెట్ ఇచ్చేశామని అన్నారు. న్యాసా వాల్మీకి వర్గీయులు ఎక్కువగా ఉన్న ఆ నియోజక వర్గంలో అదే వర్గానికి చెందిన డాక్టర్ యోగేష్ బాబు విజయం సాధిస్తారని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

మాజీ సీఎం ఏం చేశారు
చాముండేశ్వరి నియోజక వర్గంతో సీఎం సిద్దరామయ్యకు 15 ఏళ్ల కిత్రం సంబంధం తెగిపోయిందని, అక్కడ ఆయన గెలవలేరని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి ఆరోపణలపై సిద్దూ స్పందించారు. ఆయనకు ఏమైనా ఇక్కడి ప్రజలతో సంబంధాలు ఉన్నాయా, ఆయన సీఎం అయిన సమయంలో చాముండేశ్వరి నియోజక వర్గానికి ఏం చేశారు అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.

నేను దిగజారలేను
సీఎం సిద్దరామయ్యకు దమ్ముంటే తన మీద పోటీ చెయ్యాలని మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి సవాలు చేశారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ తాను దిగజారి మాట్లాడలేనని, ఇలాంటి మాటలు ఆయనకే వస్తాయని అన్నారు.

హీరో అయితే ఓడిపోయాడా !
అంత దమ్ము ఉన్న మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి చిక్కబళ్లాపురలో ఎందుకు ఓడిపోయారు, ఆయన భార్య అనితా కుమారస్వామి చెన్నపట్టణలో ఎందుకు ఓడిపోయారు అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలను పిలిపించి తాను మాట్లాడుతానని, అన్ని సర్దుకుంటాయని సీఎం సిద్దరామయ్య అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!