చెన్నై రోడ్లపై ఇక ఈ బస్సులు రయ్.. రయ్
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. నిన్నటికి నిన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటించింది. గతంలో పరిమితంగా టౌన్ బస్సుల్లో మాత్రమే ఉన్న ఉచిత ప్రయాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేసింది. దీనికోసం ప్రత్యేక పథకాన్ని కూడా ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఇది అమలులోకి రాబోతోంది.
ఈ క్రమంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు విజయ్. చెన్నైలో పర్యావరణ పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ బస్సులకు శ్రీకారం చుట్టారు. మలి విడతలో 130 నూతన ఏసీ ఎలక్ట్రిక్ సిటీ బస్సులను సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బస్సులన్నీ కూడా చెన్నై నగరం పరిధిలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

విడతల వారీగా మొత్త 1,375 ఏసీ ఈవీ బస్సులను నడిపించడానికి మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. గతంలో 625 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. చెన్నై సిటీ పరిధిలో గల వ్యాసార్ పాడి, పెరుంబాక్కం, పూనమల్లి, సెంట్రల్- 1, తొండియార్‌పేట్-1 డిపోలకు వీటిని కేటాయించారు. అవన్నీ కూడా ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉంటోన్నాయి. వాటి ఆక్యుపెన్సీ భారీగా ఉంటోంది. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇప్పుడు తాజాగా మలి విడత కింద మరో 130 సిటీ ఈవీ ఏసీ బస్సులను ముఖ్యమంత్రి విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. అలందూరు, పెరంబూర్, ఆవడి, సెంట్రల్ డిపో 2, పాడియనల్లూర్, కేకే నగర్, అయ్యప్పన్ థంగల్ కు వీటిని కేటాయించారు. ఈ ఈవీ బస్సులకు కావాల్సిన మౌలిక వసతులను ఆయా డిపోల్లో కల్పించారు. ఛార్జింగ్ పాయింట్లు కూడా అక్కడ ఏర్పాటయ్యాయి. ఈ బస్సులన్నీ కూడా లో ఫ్లోర్ తరహాలో డిజైన్ చేసినవే. వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలు, వారితో ప్రయాణించే మహిళలు సురక్షితంగా బస్సు ఎక్కడానికి, దిగడానికి వీలవుతుంది.
మొత్తం ఈ 1,375 ఎలక్ట్రిక్ బస్సులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై సిటీలోని పర్యావరణహిత గ్రీన్ ఫ్లీట్ సామర్థ్యం భారీగా పెరుగుతుందని మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వీటి అంచనా వ్యయం దాదాపు 697 కోట్ల రూపాయలు. అత్యధిక ప్రయాణికుల రద్దీ గల మార్గాలలో ఈ బస్సుల సంఖ్యను పెంచడం వల్ల ప్రయాణికులకు వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.














Click it and Unblock the Notifications