వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫీ, రెడ్‌ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాఫీ

కొన్ని ఆహార పదార్థాలపై మనకు కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చి పడుతుంటోంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే.. ఇవి చాలా ప్రమాదకరమని మరికొన్ని వెల్లడిస్తుంటాయి.

కొన్ని ఆహార పదార్థాల విషయంలో కాలానికి అనుగుణంగా అభిప్రాయాలు, సూచనలు కూడా మారుతుంటాయి.

మానవ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లుగా పేర్కొంటూ.. చాలా అధ్యయనాలకు కేంద్ర బిందువైన ఆహార పదార్థాల్లో కాఫీ, రెడ్‌ వైన్‌ కూడా ఉంటాయి.

వీటి విషయంలో కూడా భిన్న అధ్యయనాలు భిన్నంగా ఫలితాలను వెల్లడించాయి. ఇవి ఆరోగ్యాన్ని పరిరక్షించగలవని కొన్ని పరిశోధనలు చెబుతుంటే, ఇవి ఆరోగ్యానికి హానికరమని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

అయితే, ఈ పానీయాల గురించి తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? మానవ ఆరోగ్యంపై కాఫీ, రెడ్‌ వైన్ చూపుతున్న ప్రభావాన్ని కనుక్కొనేందుకు ఇద్దరు శాస్త్రవేత్తలతో మేం మాట్లాడాం.

కాఫీ

కాఫీ, జీవిత కాలం..

రోజూ ఉదయం తాగే కాఫీకు మన జీవిత కాలాన్ని పొడిగించే సామర్థ్యం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.

దీనిపై అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌ జర్నల్‌లో తాజాగా ఒక పరిశోధన ఫలితాలు ప్రచురించారు. పదేళ్లపాటు దాదాపు 2,00,000 మందిపై ఈ అధ్యయనం సాగింది.

రోజూ 1.5 నుంచి 3.5 కప్పుల కాఫీను ఒక స్పూన్ పంచదారతో కలిపి తాగేవారిలో, ఇతరులతో పోల్చినప్పుడు, మరణ ముప్పు 30 శాతం తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

మరోవైపు అసలు పంచదార లేకుండా కాఫీ తాగేవారి విషయంలోనూ ఈ ముప్పు 16 నుంచి 21 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ తాగేవారిలో మిగతావారితో పోల్చినప్పుడు మరణ ముప్పు అతితక్కువగా ఉన్నట్లు తేలింది.

కాఫీతో మరణ ముప్పు తగ్గుతుందని వెల్లడించిన తొలి అధ్యయనం ఇదేమీ కాదు. 2018లోనూ పదేళ్లపాటు 5,00,000 మందిపై చేపట్టిన ఒక అధ్యయనం ప్రచురించారు. ఇందులోనూ కాఫీతో అకాల మరణ ముప్పు 16 శాతం వరకు తగ్గుతుందని వెల్లడించారు.

మరోవైపు డీకాఫినేటెడ్ కాఫీ తాగే వారిలోనూ ఈ మరణ ముప్పు తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కాఫీలో కెఫీన్‌తోపాటు చాలా సమ్మేళనాలు ఉండటమే దీనికి కారణం.

అయితే, చాలా మంది ఇప్పటికీ కాఫీ ఆరోగ్యానికి హానికరమని, దీన్ని తాగడం తగ్గించుకోవాలని భావిస్తుంటారు. ఇంతకీ ఈ అపోహలు ఎంతవరకు నిజం?

కాఫీ

''కొన్ని ఏళ్ల నుంచి ఆరోగ్యంపై కాఫీ చూపే ప్రభావం మీద మన దృక్పథం మారుతూ వస్తోంది’’అని మ్యాడ్రిడ్‌ అటానమస్ యూనివర్సిటీకి చెందిన ప్రివెంటెవ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్తేర్ లోపెజ్ గార్సియా చెప్పారు. కాఫీ, హృద్రోగాల మధ్య సంబంధాలను తెలుసుకునేందుకు నిర్వహించిన అధ్యయనాల్లో ఆమె పాల్గొన్నారు.

''2003 నుంచి ఈ అధ్యయనాల కోసం తీసుకుంటున్న ప్రజల శాంపిల్ సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా కాఫీ అలవాటును పరిశోధకులు ఏళ్ల నుంచి గమనిస్తున్నారు. దీంతో అకాల మరణం, హృద్రోగాలు, టైప్-2 మధుమేహం లాంటి అనారోగ్యాలతో దీనికుండే సంబంధాలను లోతుగా పరిశీలించేందుకు వీలుపడుతోంది’’అని గార్సియా చెప్పారు.

''పొగాకు, ఆల్కహాల్ లాంటి వాటితో పోల్చినప్పుడు కాఫీని తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉన్నట్లు ఏ పరిశోధనల్లోనూ రుజువుకాలేదు. ముఖ్యంగా మధుమేహం, పక్షవాతం ముప్పులను తగ్గించడంలో కాఫీ ఉపయోగపడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది’’అని ఆమె వివరించారు.

''కాఫీని తరచూ తాగేవారిలో కెఫిన్ ప్రతికూల ప్రభావాల గురించి కూడా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనితో వచ్చే ప్రతికూల ప్రభావాల కంటే జరిగే మంచే ఎక్కువ’’అని ఆమె చెప్పారు.

మరోవైపు పార్కిన్సన్స్‌తోపాటు మేధోపరమైన సమస్యలు, క్యాన్సర్ ముప్పులను కూడా తగ్గించడంలో కాఫీ ఉపయోగపడుతుందని మరికొన్ని అధ్యయనాల్లో వెలుగుచూసింది.

''అయితే, ఇక్కడ మధుమేహ ముప్పును కాఫీ తగ్గించగలదని చాలా అధ్యయనాల్లో రుజువైంది. మిగతా వ్యాధుల విషయంలో ఈ సంబంధాలపై అంత స్పష్టమైన ఆధారాలు బయటపడలేదు’’అని గార్సియా వివరించారు.

కాఫీలో వెయ్యికిపైగా సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో చాలా పదార్థాలు మన ఆరోగ్యంపై చూపే ప్రభావం మీద అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

ఉదాహరణకు కాఫీలో పెద్దయెత్తున యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినే ముప్పును తగ్గించగలవని చాలా అధ్యయనాల్లో రుజువైంది.

''మన ఆరోగ్యంపై కాఫీ చూపే సానుకూల ప్రభావానికి ఈ యాంటీ-ఆక్సిడెంట్లలో ఒకటైన క్లోరోజెనిక్ యాసిడ్ కారణం’’అని డాక్టర్ గార్సియా వివరించారు.

''అది గ్లూజోక్ మెటబాలిజంపై సానుకూల ప్రభావాలు చూపుతుంది. మరోవైపు కాఫీలో మెగ్నిషియం కూడా ఉంటుంది. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి’’అని ఆమె చెప్పారు.

అయితే, కొంతమందిలో కెఫిన్ వల్ల ఆందోళన, నిద్రలేమి లాంటి సమస్యలు కూడా రావచ్చని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.

అందుకే కాఫీని మూడు నుంచి ఐదు కప్పులకే పరిమితం చేయాలని మ్యాడ్రిడ్ అటానమస్ యూనివర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు.

''నేడు పంచదార లేకుండా కాఫీని తాగాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు’’అని గార్సియా అన్నారు.

''అయితే, నిద్రలేమి, ఆందోళన, రక్తపోటు లాంటి సమస్యలు ఉండేవారిలో ఈ లక్షణాలను కాఫీ మరింత తీవ్రంచేసే ముప్పు ఉంటుంది. అందుకే ఇక్కడ సూచనలు, సలహాలు వ్యక్తులను బట్టీ మారుతుంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వైద్యులను లేదా ఆహార నిపుణులను సంప్రదిస్తే మంచిది’’అని ఆమె చెప్పారు.

రెడ్ వైన్

రెడ్‌ వైన్ సంగతేంటి?

ఆల్కహాల్‌లో రెడ్‌ వైన్‌కు కాస్త మంచి పేరుంది.

అప్పుడప్పుడు ఒక గ్లాసు రెడ్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని ఇటీవల కొన్ని అధ్యయనాలు సూచించాయి. ముఖ్యంగా గుండెను సంరక్షించడంలో రెడ్‌ వైన్ కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నాయి.

ఈ విషయంపై 2019లో జర్నల్ మాలిక్యూల్స్‌లో ఒక అధ్యయనం ప్రచురించారు. రెడ్ వైన్‌లోని పాలీఫెనాల్ సమ్మేళనాల వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని దీనిలో పేర్కొన్నారు.

అయితే, గుండె ఆరోగ్యానికి ఆల్కహాల్ అసలు మంచిదికాదని జనవరిలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూహెచ్ఎఫ్) హెచ్చరించింది.

''గత కొన్ని దశాబ్దాలుగా ప్రజల్లో గుండె వ్యాధుల ముప్పు రెట్టింపు అయ్యింది’’అని ఆ నివేదికలో డబ్ల్యూహెచ్‌ఎఫ్ ప్రముఖంగా ప్రస్తావించింది. చాలా మంది హృద్రోగ ముప్పులకు ఆల్కహాల్ కారణమని పేర్కొంది.

''ఆల్కహాల్‌తో జీవిత కాలం పెరుగుతందని గత 30ఏళ్లుగా చాలా చోట్ల వింటున్నాం. కానీ, ఇది అపోహ మాత్రమే’’అని నివేదికలో డబ్ల్యూహెచ్‌ఎఫ్ వివరించింది.

హృద్రోగాలతోపాటు మరికొన్ని అనారోగ్యాల ముప్పును కూడా ఆల్కహాల్ పెంచుతుందని నివేదికలో పేర్కొన్నారు.

రెడ్ వైన్

ఇంతకీ మంచివా కాదా?

మరి రెడ్ వైన్ మంచిదా? కాదా? ఈ ప్రశ్నను స్పెయిన్‌ సలమంకా యూనివర్సిటీలోని బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు డాక్టర్ మీగల్ మార్కోస్ మర్టీన్‌ను ప్రశ్నించాం.

''ఆల్కహాల్‌తో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దీనితో కలిగే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ, దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది’’అని మర్టీన్ చెప్పారు.

''అందుకే ఏరకమైన ఆల్కహాల్ అయినప్పటికీ, తీసుకోవడం మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు’’అని ఆయన తెలిపారు.

''ఇక రెడ్ వైన్ విషయానికి వస్తే, ఇది గుండెకు మంచిదని కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్నారు. కానీ, వీటి విషయంలో స్పష్టతలేదు. వీటి వెనుక శాస్త్రీయతపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి’’అని ఆయన అన్నారు.

''బహుశా కొన్ని వ్యాధుల నుంచి రెడ్ వైన్ రక్షణ కల్పిస్తూ ఉండొచ్చు. కానీ, దాని దుష్ప్రభావాలను కూడా మనం గుర్తించాలి. ముఖ్యంగా కాలేయ వ్యాధులను మనం అసలు మరచిపోకూడదు’’అని ఆయన చెప్పారు.

కారణం ఏమిటి?

గుండెకు రెడ్‌ వైన్‌ మంచిదని చెప్పేవారు ఎక్కువగా ''రెస్వెరట్రోల్’’ సమ్మేళనాల గురించి ప్రస్తావిస్తుంటారు. రెడ్ వైన్‌లో కనిపించే వీటిని పాలిఫెనాల్ సమ్మేళనాలుగా పిలుస్తారు. ఇవి కూడా యాంటీ-ఆక్సిడెంట్లలానే పనిచేస్తాయి. మన శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఫలితంగా హృద్రోగాలు, క్యాన్సర్‌ల ముప్పు కొంతవరకు తగ్గుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ సమ్మేళనాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడే ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపగలవని, రెండు, మూడు గ్లాసుల రెడ్ వైన్‌తో ఫలితాలు కనిపించకపోవచ్చని మర్టీన్ అన్నారు. అలాగని ఎక్కువ మొత్తంలో తాగితే కాలేయం దెబ్బతింటుందని వివరించారు.

''పైగా ఒక్క ఆల్కహాల్ తాగడం వల్లే ఈ సానుకూల ప్రభావాలు వచ్చాయని చెప్పడం కష్టం’’అని మర్టీన్ చెప్పారు.

''మరికొంతమంది ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితేనే కాలేయం దెబ్బతింటుందని భావిస్తారు. కానీ, ఒక గ్లాసు వైన్ కూడా ప్రమాదరకమేనని గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన తెలిపారు.

ముఖ్యంగా, ఆల్కహాల్ తాగడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా మన మెదడు నుంచి తుడిచివేయాలని ఆయన సూచించారు.

''తప్పనిసరి పరిస్థితుల్లో వీలైనంత తక్కువ ఆల్కహాల్‌ను తీసుకోవడం ద్వారా ఈ అనారోగ్య ముప్పుల నుంచి తప్పించుకోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coffee, red wine: Drinking too much of these can be harmful to health
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X