చలి పంజా: గడ్డ కట్టిన సరస్సు..
Cold Wave: ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది.
హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది. విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లఢక్.. తడిచి ముద్దవుతున్నాయి. స్విట్జర్లాండ్‌ను తలపిస్తోన్నాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడం వల్ల వాహనాల రాకపోకలు సైతం మందగించాయి.
జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో ఉష్ణోగ్రత మైనస్‌లల్లో పడిపోయింది. ఫలితంగా శ్రీనగర్‌లో గల ప్రఖ్యాత దాల్ లేక్ గడ్డ కట్టుకుపోయింది. రెండంగుళాల మేర మంచు ఫలకాలు ఆ సరస్సు ఉపరితలంపై ఏర్పడ్డాయి. మంచు దుప్పటి కప్పుకొన్న కాశ్మీర్ అందాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటోన్నారు.
లఢక్ రాజధాని లేహ్ మైనస్ 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే తీవ్రత జమ్మూ కాశ్మీర్‌లోనూ నెలకొంది. పహల్‌గామ్ మైనస్ 7.8, శ్రీనగర్: -6.6, కుప్వారా: -6.4, కుకెర్‌నాగ్: -6.4, బనిహాల్: -2.0 డిగ్రీల మేర టెంపరేచర్ రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పాలో కనిష్ఠ ఉష్ణోగ్రత -2.8గా నమోదైంది.
అటు దేశ రాజధానినీ చలి చుట్టుముట్టింది. సఫ్దర్‌గంజ్‌లో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. దట్టమైన పొగమంచు ఆయా ప్రాంతాలను అలముకుంది. నిరాశ్రయులు, పేదల కుటుంబాల వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. వాళ్లంతా అక్కడే తలదాచుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications