ఈశాన్య రాష్ట్రాల్లో లోక్ సభ పోరుకు కాంగ్రెస్ వ్యూహం రెడీ- మణిపూర్ ప్రజలకు సంఘీభావం..
కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ సమావేశమయ్యారు. మణిపూర్‌లో పరిస్థితిపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజలకు తమ మద్దతు, సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి సంఘీభావంగా నిలుస్తోందని ప్రకటించారు. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధానమంత్రి, ఎన్టీయే సర్కార్ నిష్క్రియాత్మకత, మౌనం క్షమించరానిదని, నేరపూరితమైనదని నేతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మణిపూర్ ప్రజలకు, ప్రత్యేకించి, మొత్తం ఈశాన్య ప్రజలపై తన బాధ్యతను విస్మరించిందని ఇవాళ భేటీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి అన్ని ఈశాన్య ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు మణిపూర్ ప్రజల గొంతును వినిపించాలని, అలాగే అక్కడ హింసను అంతం చేయడానికి త్వరిత పరిష్కారం కోసం డిమాండ్ చేస్తాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పటిష్టమైన, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలన్నారు.ఇందుకు వెంటనే కాల్పుల విరమణ, శాంతి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి సమయంలో అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం కసరత్తు చేపట్టడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ గందరగోళ సమయంలో మణిపూర్‌లో ప్రేమ, కరుణ, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో అక్కడ పర్యటించిన రాహుల్ గాంధీని నేతలు అభినందించారు. మణిపూర్ హింసలో చనిపోయిన దాదాపు 150 మంది ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు.

ఈ సమావేశంలో మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా మణిపూర్‌లో పరిస్థితి దిగజారడం పట్ల ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపూర్ లో పరిస్ధితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తృతంగా నేతలు పర్యటించి దీన్ని వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications