కోపాన్ని గుర్తించలేదు, తుడిచి పెట్టుకుపోలేదు: సోనియా
న్యూఢిల్లీ: ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయామని, ఓటమి నుండి పాఠాలు నేర్చుకుందామని, ఒకరినొకరు నిందించుకోవద్దని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పసిగట్టడంలో విఫలమయ్యామన్నారు. కనీవినీ ఎరుగని ఎదురుదెబ్బ తగిలిందని, ఇలా ఎందుకు జరిగిందో సమష్టిగా సమీక్షించుకుని తగిన పాఠాలు నేర్చుకోవాలన్నారు.
ఒకరినొకరు బహిరంగంగా నిందించుకోవడం మాని ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సవరించుకునేందుకు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. నాయకులందరూ తమ అనుభవంతో పార్టీ బలాలను, బలహీనతలను అంచనావేసి పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోలేదన్నారు. బిజెపి 17.16 కోట్ల ఓట్లు సాధిస్తే, కాంగ్రెస్ 10.69 కోట్ల ఓట్లు సాధించి రెండో స్థానంలో ఉండడమే దీనికి నిదర్శనమన్నారు.

దీని నుండి స్ఫూర్తి పొంది విస్తృత మద్దతు కోసం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలలో కనీసం ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదన్న విషయాన్ని గుర్తించి.. పార్టీ పూర్వవైభవానికి కృషి చేయాలన్నరు. యూపిఏ-2 ఎజెండాను 15వ లోకసభలో పూర్తి చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం బిజెపి మద్దతు ఇవ్వలేదన్నారు.
వాటిని పూర్తి చేయడానికే 16వ లోకసభ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అధికార బిజెపి ఎలా వ్యవహరిస్తుందో చూడాలన్నారు. బిజెపి సహకారం లేకపోవడంతో అనేక ప్రధాన బిల్లులను తాము అమోదించలేకపోయామన్నారు. లోకసభలో కాంగ్రెస్ బలం తక్కువే అయినప్పటికీ రాజ్యసభలో ప్రస్తుతానికి కాంగ్రెసే అతి పెద్ద పార్టీ అన్నారు. ప్రస్తుతం తమకున్న ఎంపీలతోనే బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించవచ్చన్నారు.
అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే విషయంలో భావసారూప్యత గల పార్టీలతో కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ అంశాలను లేవనెత్తాలని పిలుపునిచ్చారు. కాగా, అంతకుముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ పేరును సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా.. ఎంపీలందరూ ఆమోదించారు. అలాగే లోకసభ, రాజ్యసభలలో ప్రతిపక్ష నేతలను ఎంపిక చేసే బాధ్యతలను కూడా సోనియాకు అప్పగించారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలినంతమాత్రాన పార్టీకి సోనియా, రాహుల్ చేసిన సేవలను మరిచిపోలేమని పలువురు ఎంపీలు అన్నారు.












Click it and Unblock the Notifications