కిరణ్‌కు ప్రత్యామ్నాయం?: రహస్యంగా ఢిల్లీకి శ్రీధర్ బాబు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కాంగ్రెసు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీధర్ బాబుకు కాంగ్రెసు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర కాంగ్రెసు నాయకుల్లో కలకలం ప్రారంభమైంది. శ్రీధర్ బాబును అకస్మాత్తుగా ఎందుకు కాంగ్రెసు పెద్దలు ఆహ్వానించారనేది అంతు పట్టడం లేదు. తన ఢిల్లీ పర్యటనను శ్రీధర్ బాబు అత్యంత రహస్యంగా ఉంచారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లును శాసనసభకు పింపించే ముందు, రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాడనికి అవసరమైన కసరత్తును కాంగ్రెసు అధిష్టానం ప్రారంభించింది. రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తారని, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి విధేయుడని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి నమ్మకం కుదరడం లేదని అంటున్నారు.

రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశాన్ని హైదరాబాదులో కాకుండా ఢిల్లీలో ఏర్పాటు చేయడంలోనే కాంగ్రెసు అధిష్టానం ఎత్తుగడ ఉందని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సమన్వయ కమిటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని చూసిన తర్వాత అవసరమైతే ఆయన స్థానంలో మరో నేతను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
సాధ్యమైనంత వరకు కిరణ్ కుమార్ రెడ్డిని దారిలోకి తెచ్చుకునే విషయం మీదే కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని మార్చబోమని,త కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయన కుటుంబం కూడా కాంగ్రెసు పట్ల విధేయత ప్రదర్శిస్తూ వస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. దీన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా విభజన ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డితో సాధ్యం కాదని భావించిన పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పవని భావించి శ్రీధర్ బాబును ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు.
కాగా, విభజనకు ముందే రెండు పిసిసిలను ఏర్పాటు చేసే కసరత్తును పూర్తి చేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పిసిసికి శ్రీధర్ బాబును చేసే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, వరద నష్టంపై ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు శ్రీధర్ బాబు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications