మనీష్ తివారీ కూడానా..? క్లారిటీ ఏంటీ?
Manish Tewari: లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంటోంది.
ఢిల్లీలోని భారత్ మండప్ వేదికగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు. ఆయనను తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వంటి హేమాహేమీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అటు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో పర్యటిస్తోన్నారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. ఈ ఉదయం ఆయన తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్‌లో పర్యటించారు. ఏనుగుల దాడిలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు.
ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మనీష్ తివారీ.. పార్టీకి గుడ్ బై చెప్పబోతోన్నారనేది దాని సారాంశం. త్వరలోనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంటారని, అనంతరం జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొంటారనే ప్రచారం జోరుగా సాగింది. జాతీయ మీడియా మొత్తం ఇవే వార్తలను కవర్ చేసింది.
నిన్నటికి నిన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్.. కాంగ్రెస్ పార్టీకి వీడుతున్నారంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. వారిద్దరూ కూడా ఈ వార్తలను తోసిపుచ్చలేదు. కొట్టివేయడానికి ఇష్టపడనూ లేదు. దీనితో ఆయన పార్టీ ఫిరాయిస్తారనే అభిప్రాయాలు మరింత బలంగా వ్యక్తం అయ్యాయి.
అదే సమయంలో మనీష్ తివారీ సైతం బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది. ఈ వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. మనీష్ తివారీ పార్టీ ఫిరాయించట్లేదని స్పష్టం చేసింది. దీనిపై వస్తోన్న వార్తలన్నీ నిరాధారమైనవని పేర్కొంది.












Click it and Unblock the Notifications