2014 కోసం కొత్త పద్ధతి అవలంభించాం: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: 2014 ఎన్నికల ప్రణాళికలో తాము కొత్త పద్ధతులను అవలంభించామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు.
తొమ్మిదేళ్ల యూపిఏ పాలనలో దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చామన్నారు. ఉత్పాదక రంగంతో కలిసి ఆర్థికాభివృద్ధి స్ధించామన్నారు. ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను కాంగ్రెసు పార్టీయే బలోపేతం చేసిందని, మేనిఫెస్టో కోసం అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు.

ప్రజాకాంక్షను ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందించామని... ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించేందుకు ఐదు నెలలు కష్టపడ్డామని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలిపారు. 2009 మేనిఫెస్టోలో ప్రతిపాదించిన అన్ని అంశాలను అమలు చేశామని అన్నారు.
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని మేనిఫెస్టోలో పొందుపరిచామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను కాళ్ల మీద నిలబడేలా చేసిందని, యువత శక్తి సంపన్నులుగా మారేందుకు తగిన ప్రణాళికలు సిధ్ధం చేశామని రాహుల్ తెలిపారు. పేదలు పారిశ్రామిక రంగాలకు అనుసంధానం కావాలన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. తమ మేనిఫెస్టో దేశ ప్రజలకు అనుగుణంగా ఉంటుందన్నారు.
తమది పేద ప్రజల మేనిఫెస్టో అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. 2009 మేనిఫెస్టోలోని తొంభై శాతం హామీలు నెరవేర్చామన్నారు. కాంగ్రెసు పార్టీ విధానం గుజరాత్ విధానాలకు పూర్తి భిన్నమన్నారు.












Click it and Unblock the Notifications