వలంటీర్‌గా రాహుల్ గాంధీ..!!
న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది కాంగ్రెస్. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపైనా దృష్టి పెట్టింది.

అధికార బీజేపీ- ఎన్డీఏ దూకుడును అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రాగలిగింది. ఇండియా పేరుతో ప్రతిపక్ష పార్టీలతో ఉమ్మడి ఐక్య కూటమిని ఏర్పాటు చేసుకుంది. వారికి దిశానిర్దేశం చేసే బాధ్యతలను స్వీకరించింది కాంగ్రెస్. అటు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులకు సారథ్యాన్ని వహిస్తోంది.
ఈ పరిణామాల మధ్య- రాహుల్ గాంధీ పంజాబ్‌లో పర్యటించారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రఖ్యాత అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఓ సాధారణ భక్తుడిలా ప్రార్థనల్లో పాల్గొన్నారు. సెలవురోజు కావడం వల్ల గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తోన్న వారి సంఖ్య భారీగా ఉంది.

వారితో కలిసి ప్రార్థనలు చేశారు రాహుల్ గాంధీ. అనంతరం కమ్యూనిటీ కిచెన్‌లో అల్పాహారాన్ని తీసుకున్నారు. అక్కడే వలంటరీ సేవల్లో పాల్గొన్నారు. భక్తులు ఆహారాన్ని స్వీకరించిన అనంతరం మిగిల్చిన గిన్నెలను రాహుల్ గాంధీ కడిగారు. సిక్కులు సంప్రదాయబద్ధంగా ధరించిన స్కార్ఫ్‌ను తలకు చుట్టుకుని కనిపించారాయన.

ప్రజలతో మమేకమౌతోన్నారు రాహుల్ గాంధీ. ఇదివరకు ఢిల్లీలోని కీర్తినగర్ ఫర్నిచర్ మార్కెట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. కార్పెంటర్ షాపులను సందర్శించారు. వడ్రంగులతో ముచ్చట్లు పెట్టారు. అంతకుముందు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. సూట్ కేసులను సైతం మోశారు. ఛత్తీస్‌గఢ్‌లో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు రైలులో ప్రయాణించారు.












Click it and Unblock the Notifications