అమరీందరే కెప్టెన్-అసంతృప్తులకు కాంగ్రెస్ ఝలక్-ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ పార్టీలోని అసంతృప్త నేతలకు క్లారిటీ ఇచ్చేసింది. సీఎం అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్న వారికి ఝలక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో అమరీందర్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించింది.
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న అసంతృప్తులపై చర్చించిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ హరీష్ రావత్ తో ఈ మేరకు క్లారిటీ ఇప్పించింది. పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులు పాకిస్తాన్, కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై వారిని టార్గెట్ చేసిన అమరీందర్ పై అసమ్మతి స్వరాలు మొదలయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేలు, కొందరు కేబినెట్ మంత్రులు కూడా స్వరాలు పెంచారు. దీంతో అధిష్టానం జోక్యం చేసుకుంది.

నిన్న అమరీందర్ కు వ్యతిరేకంగా 23 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు అసమ్మతి భేటీ ఏర్పాటు చేశారు. అమరీందర్ ను సీఎంగా తప్పించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ ను బతికించాలంటే కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించాలని అధిష్టానాన్ని కోరారు. త్వరలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిసి ఈ విషయంపై చర్చిస్తామని అమరీందర్ కేబినెట్ లో మంత్రి రాజీందర్ సింగ్ బజ్వా తెలిపారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ జోక్యం చేసుకుని సమస్యపై చర్చించింది. చివరకు పార్టీ ఇన్ ఛార్జ్ హరీష్ రావత్ తో అమరీందరే బాస్ అని చెప్పించింది.
పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూకు బాధ్యతలు అప్పగించాక... అమరీందర్ ను టార్గెట్ చేయరాదని అధిష్టానం సూచించింది. అయినా సిద్ధూ అనుచరులు అమరీందర్ పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్.. అమరీందర్ కు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజేతగా నిలిపిన ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఎదుర్కొంటామని వెల్లడించింది. దీంతో సీద్ధూతో పాటు ఆయన అనుచరులకు భారీ షాక్ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications