కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 140కిపైగా సీట్లు ఖాయం: సర్వేలపై డీకే శివకుమార్
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపు అని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపు అని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో కాంగ్రెస్ 140 సీట్లకుపైగా గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. అంతేగాక, బీజేపీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు.
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మైసూరు మాజీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం డీకే శివకుమార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు నాయకుల్లో కొల్లేగల మాజీ ఎమ్మెల్యే జీఎన్ నంజుండస్వామి, బీజాపూర్ మాజీ ఎమ్మెల్యే మనోహర్ ఐనాపూర్, మైసూరు
మాజీ మేయర్ పురుషోత్తం ఉన్నారు.

ఎలాంటి షరతులు లేకుండా నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని, పార్టీ సిద్ధాంతాలను, నాయకత్వాన్ని అంగీకరించారని అన్నారు డీకే శివకుమార్.
2022 గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో ఎన్నికలకు పిలుపునివ్వాలని బీజేపీ కోరుకుందని.. అయితే ఆ చర్యపై వెనక్కి తగ్గిందని శివకుమార్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. అయితే వారి పేర్లను తాను చెప్పను అని తెలిపారు డీకే శివకుమార్.
'మా మునుపటి సర్వే మా సీట్ల సంఖ్యను 136గా అంచనా వేసింది, ఇప్పుడు మా సర్వే 140 సీట్ల కంటే ఎక్కువగా ఉందని అంచనా వేసింది. మార్పు ప్రారంభమైంది. మేము రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు మేము దాన్ని చూస్తున్నాము' అని శివకుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం హడావుడి అభివృద్ధి పనులు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికలు తక్షణం జరిగినా, కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాగ్దానాన్ని "బోగస్" అని అన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని.. ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని శివకుమార్ సవాల్ విసిరారు.
కాగా, మే నాటికి కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications