బీజేపీ అవినీతిని గోమూత్రంతో కడిగేసిన కాంగ్రెస్
బెంగళూరు: కర్ణాటక శాసన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవ్వాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మూడు రోజుల పాటు సమావేశం కొనసాగుతుంది. సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే ఎన్నికయ్యారు. ఉత్తర కన్నడ జిల్లాలోని హలియాళ్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
కాంగ్రెస్ రివర్స్ స్ట్రాటజీ.. గోమూత్రంతో అసెంబ్లీ శుద్ధి..!!#Congress #BJP #KarnatakaCM #KarnatakaAssembly #Oneindiatelugu pic.twitter.com/hibdUTsYsW
— oneindiatelugu (@oneindiatelugu) May 22, 2023
ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఆయన శాసన సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన సునీల్ హెగ్డేను మూడువేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బసనగౌడ పాటిల్ యత్నాళ్, మునిరత్నం నాయుడు, ఆర్ అశోక, రమేష్ జార్కిహోలి.. ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 135 సీట్లు లభించాయి. బీజేపీకి 66 స్థానాలు దక్కాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 నియోజకవర్గాలకే పరిమితమైంది. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. వారిలో ఇద్దరు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు కూడా.
ఈ సమావేశాల ఆరంభానికి ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ భవనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగాలని ప్రార్థించారు. సిద్ధరామయ్య-డికే శివకుమార్ ద్వయం.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరాలన సాగిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకున్నారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
పూజల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ భవనం ప్రాంగణాన్ని గోమూత్రంతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమం మొత్తం వేదమంత్రోచ్ఛారణల మధ్య సాగింది. మూడున్నర సంవత్సరాల బీజేపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని, అందుకే- వాటన్నింటినీ గోమూత్రంతో శుద్ధి చేశామని వివరించారు. ఆ అవినీతి తమ పార్టీకి అంటకూడదని దిష్టి తీశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications