ముంబైలో కరోనా కరాల నృత్యం: పోలీసు శాఖలో తొలి మరణం నమోదు
ముంబై: మహారాష్ట్రలో ముఖ్యంగా రాజధాని నగరం ముంబైలో కరోనావైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. వేలాది మంది కరోనా బారిన పడగా, వందలాది మంది మృతి చెందారు. తాజాగా, కరోనా బారిన పడి ముంబైలో 57ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
వకోలా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న చంద్రకాంత్ పెండూకర్ అనే ఈ కానిస్టేబుల్ గత కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పోలీసు శాఖలో రాష్ట్రంలో చోటు చేసుకున్న తొలి మరణం ఆయనదే కావడం గమనార్హం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా, ముంబైలో ఇప్పటి వరకు 96 మంది పోలీసులు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 81 మంది కానిస్టేబుల్ళు, 15 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి కోలుకున్న పోలీసులు ఏడుగురు అని ఆ శాఖ తెలిపింది.
దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7628 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1076 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6229 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 323 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications