పోయిన వారిని తీసుకుని రాలేం- మోదీ భావోద్వేగం..!!
భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

కొద్దిసేపటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రెస్క్యూ సిబ్బందితో మాట్లాడారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్- ప్రమాద వివరాలన్నింటినీ మోదీకి వివరించారు. సంఘటన స్థలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ప్రధాని- రైల్వే అధికారులతో మాట్లాడారు.
అనంతరం మోదీ అక్కడి నుంచి బాలాసోర్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతోన్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. ఆందోళన చెంద వద్దని, అన్ని రకాలుగా ఆదుకుంటామని మోదీ వారికి భరోసా ఇచ్చారు. ఆ సమయంలో ఆయన వెంట కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు.
#WATCH | "It's a painful incident. Govt will leave no stone unturned for the treatment of those injured. It's a serious incident, instructions issued for probe from every angle. Those found guilty will be punished stringently. Railway is working towards track restoration. I met… pic.twitter.com/ZhyjxXrYkw
— ANI (@ANI) June 3, 2023
అనంతరం మోదీ దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడారు. భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రమాదం- తనను తీవ్రంగా కలచివేసిందని, మాటల్లో వర్ణించలేకపోతున్నానని అన్నారు. క్షతగాత్రులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వారికి అవసరమైన వైద్య సహాయాన్ని భరిస్తామని చెప్పారు. పోయిన వారిని తీసుకుని రాలేమని, మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని, ఈ కష్టసమయంలో వారికి తోడుంటామని అన్నారు.
ఈ సంకట పరిస్థితుల నుంచి బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోదీ చెప్పారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్నామని, అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మోదీ అన్నారు. కారకులపై అత్యంత కఠిన చర్యలను తీసుకుంటామని, వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైల్వే అధికారులు, ప్రత్యేకించి- స్థానిక యువకులు సహాయక చర్యల్లో విరామం లేకుండా పాల్గొన్నారని వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications