• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా: ఊపిరి పీల్చుకోలేపోతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చిన యువకుడిపై కేసు.. అధికారులపై ప్రజాగ్రహం

By BBC News తెలుగు
|

ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్‌లో ఒక ప్రభుత్వ ఆస్పత్రి బయట ఆక్సిజన్ దొరక్క అల్లాడుతున్నరోగులకు తన అంబులెన్స్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసిచ్చిన ఒక యువకుడిపై అధికారుల కేసు నమోదు చేశారు.

సాయం చేసేవారి గొంతు నొక్కేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా చాలామంది ఈ కేసును చూస్తున్నారు.

cylinder

అధికారులు మాత్రం ఆ యువకుడు ఆస్పత్రి బయట గందరగోళానికి కారణమయ్యాడని, దాంతో మెడికల్ స్టాఫ్‌కు సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు.

"ఇంకా, ఆ యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏడీఎం టీమ్ ఈ పూర్తి ఘటనపై దర్యాప్తు చేస్తోంది. అనవసరంగా ఎవరినైనా శిక్షించడం అనేది మా ఉద్దేశంకాదు" అని బీబీసీతో మాట్లాడిన జౌన్‌పూర్ కలెక్టర్ మనీష్ వర్మ అన్నారు.

పాండెమిక్ యాక్ట్ సెక్షన్ 3, సెక్షన్ 188, 269 కింద జౌన్‌పూర్ కొత్వాలీలోని విక్కీ అగ్రహరి అనే యువకుడిపై కేసులు నమోదు చేశారు. జౌన్‌పూర్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అతడిపై ఫిర్యాదు చేశారు.

విక్కీఅగ్రహరి దీనిపై బీబీసీతో ఫోన్లో మాట్లాడారు.

"రోగులు ఆక్సిజన్ లేకుండా అల్లాడడం నేను చూడలేకపోయా. దాంతో నా అంబులెన్స్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసి వాళ్లకు పెట్టాను" అని చెప్పారు.

కానీ సీఎంఓ తన ఫిర్యాదులో "విక్కీ, మిగతా వాళ్లు బిల్ కౌంటర్ దగ్గర శ్వాస అందని వారికి ప్రైవేటు సిలిండర్‌తో ఆక్సిజన్ ఇస్తున్నారు. వీడియో తీస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినా, మేం రోగులను కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నామని జనాలకు చెబుతున్నారు" అని తెలిపారు.

ఇంతకీ విక్కీపై ఈ కేసు నమోదు చేయడం వెనుక వాస్తవం ఏంటి?

దీనిపై కలెక్టర్ మనీష్ శర్మ బీబీసీతో మాట్లాడారు. "నాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువకుడు ఆస్పత్రి బయట రోగులకు ఆక్సిజన్ ఇచ్చి వీడియో తీస్తున్నాడు. ఆ సమయంలో ఆస్పత్రిలో పడకలు కూడా అందుబాటులో ఉన్నాయి. బయట తను ఎవరెవరికి ఆక్సిజన్ ఇచ్చాడో వారందరినీ తర్వాత ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు" అన్నారు.

"మా అధికారులు, మెడికల్ స్టాఫ్ ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు. వాళ్ల ప్రయత్నాలకు మాత్రం మీడియాలో చోటు దొరకదు. కానీ ఒక నెగటివ్ వార్త రాగానే, దానిని పెద్దది చేసి చూపిస్తారు. దానివల్ల అధికారులు మనోబలం కోల్పోతారు" అని చెప్పారు.

కోవిడ్ సెకండ్ వేవ్‌లో కూడా జౌన్‌పూర్‌లో పరిస్థితి చాలావరకూ నియంత్రణలో ఉందని, ప్రస్తుతం ఆక్సిజన్, పడకలకు ఎలాంటి సమస్యా లేదని ఆయన చెప్పారు.

విక్కీ అగ్రహరి ఎవరు

34 ఏళ్ల విక్కీ అగ్రహరి ఒక అంబులెన్స్ డ్రైవర్.

"నా దగ్గర అంబులెన్సులో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. రెండు వారాల క్రితమే నా భార్య బంగారం అమ్మేసి నేను మరో నాలుగు ఆక్సిజన్ సిలిండర్లు కొన్నాను. రెండు నాకు విరాళంగా ఇచ్చారు. నేను ఇప్పటివరకూ వంద మందికి పైగా రోగులకు ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాను" అని ఆయన బీబీసీకి చెప్పారు.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు ఎదురవుతున్న ఇబ్బందులు చూసి తాను ఒక్కో సిలిండర్‌ను 20 వేల చొప్పున కొన్నానని ఆయన తెలిపారు. గురువారం జరిగిన ఘటనను విక్కీ గుర్తు చేసుకున్నారు.

"ఆరోజు నేను సీరియస్‌గా ఉన్న ఒక రోగిని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకొచ్చాను. నా అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అక్కడ చాలామంది ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడడం కనిపించింది. వాళ్లను అడ్మిట్ చేసుకోడానికి సమయం పడుతోంది. దాంతో వాళ్లకు నేను నా అంబులెన్సులో ఉన్న ఆక్సిజన్ పెట్టాను. నేను ఒక రోగికి ఆక్సిజన్ పెట్టడంతో మరికొంతమంది రోగులు నా దగ్గరకు వచ్చేశారు. అలా చాలామంది గుమిగూడారు" అన్నారు.

"నేను 16 ఏళ్ల నుంచీ అంబులెన్స్ నడుపుతున్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అందుకే ఇది ప్రజలకు సాయం చేయాల్సిన సమయం అని అనిపించింది. అందుకే, ఇంట్లో బంగారం కూడా అమ్మేశా. నేను ఆక్సిజన్ ఇచ్చినందుకు, చాలా మంది నాకు డబ్బులు ఇవ్వాలని చూశారు. కానీ నేను తీసుకోలేదు" అని విక్కీ చెప్పారు.

మొదట్లో జౌన్‌పూర్‌లో ఒక సిలిండర్ నింపడానికి ఆయన రూ.500 ఇచ్చేవారు. ఇప్పుడు విక్కీ ఒక సిలిండర్‌ రీఫిల్లింగ్ కోసం రూ.2500 ఖర్చు చేయాల్సొస్తోంది. మేం ఫోన్లో మాట్లాడిన సమయంలో విక్కీ జౌన్‌పూర్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని రాంనగర్‌లో ఆక్సిజన్ సిలిండర్ నింపిస్తున్నారు.

తన తమ్ముడిని కూడా పోలీస స్టేషన్‌కు పిలిపించి కూర్చోపెట్టారని విక్కీ చెప్పారు. కానీ, కొత్వాలీ జౌన్‌పూర్ ఎస్‌హెచ్ఓ తారావతి మాత్రం "విక్కీ తమ్ముడు ఇక్కడకు తన సోదరుడి కేసు సమాచారం తెలుసుకోడానికే వచ్చారు. ఆ కేసులో మేం ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు" అన్నారు.

విక్కీపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో అతడి కుటుంబం భయపడుతోంది.

కానీ, విక్కీ మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా, కేసులు నమోదు చేసినా కరోనా రోగులకు సాయం అందించడం కొనసాగిస్తానని చెప్పారు..

"నేను ప్రస్తుత సంక్షోభాన్ని, జనాలకు సేవ చేసే ఒక అవకాశంగా చూస్తున్నాను. నేను జీవితాంతం సంపాదించవచ్చు. నా శక్తిమేరకు ప్రజలకు సాయం చేస్తా. నా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకోను" అన్నారు.

జౌన్‌పూర్‌లో పరిస్థితి

జౌన్‌పూర్‌లో అధికార యంత్రాంగం 'కోవిడ్ రెస్పాన్స్ వార్ రూమ్' ఏర్పాటు చేసింది. దీని ద్వారా జిల్లాలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.

జౌన్‌పూర్‌లో కోవిడ్ రోగుల కోసం ప్రస్తుతం 500 లెవల్-1, లెవల్-2 పడకలు ఉన్నాయి అని డీఎం మనీష్ చెప్పారు.

"మా కంట్రోల్ రూంకు రోజూ దాదాపు వెయ్యి కాల్స్ వస్తున్నాయి. అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్న రోగులను చేర్పిస్తున్నాం. మేం ప్రతి కాల్‌కూ రెస్పాన్స్ ఇస్తున్నాం. ఇది దారుణమైన పరిస్థితి. మేం సన్నద్ధం కావడానికి తగిన సమయం లేదు. కానీ పరిస్థితులు కష్టంగా న్నా మా అధికారులు మెడికల్ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు" అన్నారు.

ఇక్కడ కరోనా కేసులు వరుసగా పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి జౌన్‌పూర్‌లో ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

స్థానిక జర్నలిస్ట్ ఆదిత్య ప్రకాశ్ జౌన్‌పూర్‌లో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని, అధికారుల ఏర్పాట్లు సరిపోవడం లేదని చెప్పారు.

ఆక్సిజన్ కొరత వల్ల అధికారులపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. జిల్లా యంత్రాంగం కోవిడ్ కంట్రోల్ రూం ద్వారా పరిస్థితిని అదుపు చేయాలని ప్రయత్నించింది. కానీ హఠాత్తుగా రోగుల సంఖ్య పెరగడంతో అన్ని ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి. భారీ సంఖ్యలో ఉన్న కోవిడ్, నాన్ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరం ఉంది. అది సరఫరా చేయడం అధికారులకు కష్టంగా ఉంది" అన్నారు.

జౌన్‌పూర్‌లో ఆక్సిజన్ ప్లాంట్ లేదని డీఎం చెప్పారు. దాని సరఫరా కోసం పక్క నగరాలపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఆక్సిజన్ సరఫరాలో ఏ సమస్యా రాలేదని, మందస్తు ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు.

'సాయం చేసేవారి గొంతు నొక్కేసే ప్రయత్నం

సాయం చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం వారిని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తోందని యూపీ విధానాలను తీవ్రంగా విమర్శేంచే మాజీ అధికారి సూర్య ప్రతాప్ షాహీ అన్నారు.

"యూపీ ప్రభుత్వం పరిస్థితులను అంగీకరించడం లేదు. ప్రజలను అంతా బాగుందనే భ్రమలో ఉంచాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఆస్పత్రుల బయట జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆ నిజాన్ని దాచలేకపోతోంది. ఆ భయంతోనే కేసు నమోదు చేసింది. నాపైన కూడా మూడు కేసులు పెట్టారు. కానీ వాటితో ఏం చేయలేరు. సాయం చేసేవారు బయటికొచ్చి సాయం చేస్తూనే ఉంటారు" అన్నారు.

జిల్లాలో తగినన్ని ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి, పడకలు పెంచాలి, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona: A case against a young man who gave an oxygen cylinder to corona patients who could not breathe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X