భారత్ లో మళ్ళీ భారీగా.. 43,733 కరోనా కొత్త కేసులు, 930 మరణాలు ..ఆందోళనలో కేంద్రం !!
భారతదేశాన్ని కరోనా మహమ్మారి ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న భారీగా తగ్గిన కేసులు, మళ్లీ ఈ రోజు భారీగా పెరుగుదల చూపించాయి. ఒక్కసారిగా 26 శాతం కేసులు ఒకే రోజులో పెరగడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత 24 గంటల్లో 43,733 కొత్త కేసులు నమోదు కాగా భారత ఆరోగ్య శాఖ అందించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం దేశంలో కరోనా కేసులు సంఖ్య 3,06,63,665 కు చేరుకుంది.

కరోనా కారణంగా గత 24 గంటల్లో 930 మంది మృతి
గత 24 గంటల్లో 930 మంది కరోనా మహమ్మారి కి బలైపోయారు. నిన్న మరణాలు కూడా గణనీయంగా తగ్గగా, ఈరోజు మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,04,211 గా ఉంది. గత 24 గంటల్లో 47,240 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రికవరీలు 2,97,99,534గా నమోదయింది. ఇప్పటివరకు రికవరీ రేటు 97.18 శాతానికి చేరుకుంది.దేశంలో కోవిడ్ -19 క్రియాశీల కేసులు 4,59,920 కు తగ్గాయి.ఇవి మొత్తం కేసుల్లో 1.52 శాతం గా ఉన్నాయి.

కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవటం, కోవిడ్ అన్ లాక్ చర్యలు కేసుల పెరుగుదలకు కారణం
చాలా రాష్ట్రాల్లో కరోనా నిబంధనల నుండి ఉపశమనం కలిగించడం, అన్ లాక్ చర్యలకు దిగడం వంటి అంశాలు మళ్లీ కరోనా కేసులు పెరుగుదలకు కారణంగా మారుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గిందని భావిస్తున్న ప్రజలు సామాజిక దూరం నిబంధనలు పాటించకుండా, మాస్కులు ధరించకుండా, అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న తీరు కూడా కేసుల పెరుగుదలకు కారణంగా మారుతోంది. మొత్తానికి తాజా కేసుల పెరుగుదల మళ్లీ ప్రభుత్వాలను టెన్షన్ పెట్టిస్తుంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది.

దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణా పరీక్షలు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 42 కోట్ల నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, కోవిడ్ -19 కోసం ఇప్పటివరకు 42,33,32,097 నమూనాలను పరీక్షించారు. వీటిలో గత 24 గంటల్లో 19,07,216 పరీక్షలు జరిగాయి.ఈ ఏడాది జనవరి 16 న భారత్ కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కింద 35.75 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందించారు.
Recommended Video

దేశానికి థర్డ్ వేవ్ భయం .. కేసుల పెరుగుదల క్రమంగా ఇలా ..
కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగించాలని ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.భారత కోవిడ్ -19 సంఖ్య ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు, సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది. ఇది సెప్టెంబర్ 28 న 60 లక్షలు దాటింది. అక్టోబర్ 11 న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు, డిసెంబర్ 19 న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4 న భారత్ రెండు కోట్ల మైలురాయిని, జూన్ 23 న మూడు కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications