దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణం ఈ వేరియంటే... తస్మాత్ జాగ్రత్త!!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. ఫ్లూ తో పాటు కరోనా కేసులు పెరగటంతో కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది కేంద్రం.
కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టేనని అందరూ ఊపిరి పీల్చుకుని మళ్లీ తమ తమ రొటీన్ పనులలో పడిన సమయంలో, తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్న తీరు భారతదేశ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. రోజురోజుకు క్రమంగా కేసులు పెరుగుతుండడం అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెడుతుంది. అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పన పై దృష్టి సారించాలని, ఆక్సిజన్ బెడ్ లను ఏర్పాటు చేసుకోవాలని, ఆసుపత్రులలో పని చేయడానికి మానవ వనరుల పైన కూడా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటీవల కాలంలో ఫ్లూ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండడంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

ఒకవైపు ఫ్లూ, మరోవైపు కరోనా నేపథ్యంలో కేసులో పెరుగుదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న కేంద్రం జ్వరం, దగ్గు ఐదు రోజుల కంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తుంది. భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులను వాడాలని, చేతుల పరిశుభ్రత వంటివి తప్పనిసరి చేసుకోవాలంటూ సూచనలు చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన జ్వరం, తీవ్రమైన దగ్గు ఐదు రోజులకు మించి ఉంటే వైద్యుల్ని సంప్రదించాలని సూచించింది.
ముఖ్యంగా కేరళ, తమిళనాడు., కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హెచ్చరించింది. భారతదేశంలో 129 రోజుల తర్వాత ఒక్కరోజులోనే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. ఇన్సా కాగ్ డేటా ప్రకారం కర్ణాటకలో 30 కేసులు, మహారాష్ట్రలో 29 కేసులు, పుదుచ్చేరిలో ఏడు కేసులు, ఢిల్లీలో ఐదు కేసులు, తెలంగాణలో రెండు కేసులతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలో ఒక్కో కేసు చొప్పున ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ వేరియంట్ వల్ల కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంటుందని, కాకుంటే ఈ వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేదని, అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా. ఏదేమైనా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, కరోనా నిబంధనలను మళ్ళీ పాటించాల్సిన అవసరం ఉందని తాజా కేసులతో అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications