కరోనాను మర్చిపోతున్నారా? ఒక్కరోజులో 3,641 కరోనాకేసులు.. 11మరణాలు; తస్మాత్ జాగ్రత్త!!
భారతదేశంలో కరోనా కేసుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నా ప్రజలలో మాత్రం కరోనా పట్ల భయం కనిపించడం లేదు. మాస్కులు ధరిస్తున్న వారు బయట కనిపించిన దాఖలాలు కూడా లేవు. కరోనా లేదు అన్నట్టే ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలందరూ అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

గత 24 గంటల్లో భారత దేశంలో 3641 కరోనా కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో 59 వేల 512 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 3,641 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం పేర్కొంది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4కోట్ల 47 లక్షల 26 వేల 246కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 20,219 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు 20,000 మార్కును దాటడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 0.05% కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తెలిపాయి.

గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 11 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 5,30,892 కు చేరుకుంది. కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మొత్తం 11 మంది నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.76% గా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదయింది. ఇప్పటివరకు కేంద్రం 220. 66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. కాగా ప్రజలలో మాత్రం కరోనా మహమ్మారి పట్ల భయం లేకుండా పోయింది. అయితే రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, ధరించాలని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications