corona in India : మళ్ళీ భారీగా.. 38 వేలకు పైగా కొత్త కేసులు, టాప్ 5 లో దక్షిణాది రాష్ట్రాలే !!
భారతదేశంలో కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిత్యం కేసులలో హెచ్చుతగ్గులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న 30 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, మళ్లీ ఈ రోజు భారతదేశం 38 వేల పైచిలుకు కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో భారతదేశంలో 38,353 తాజా కోవిడ్ కేసులను నివేదించింది. ఇది నిన్న నివేదించిన 28,204 కన్నా 36 శాతం ఎక్కువ. ఇదే సమయంలో దేశం 497 మరణాలను నివేదించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,29,179 కి చేరుకుంది.

తాజా కేసులలో 55 శాతం కేసులు కేరళలోనే
రోజువారీ పాజిటివిటీ రేటు 2.16 శాతంగా ఉంది. ఇది గత 16 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,72,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 38,353 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. అయితే ప్రస్తుతం భారత దేశంలో నమోదవుతున్న మొత్తం కేసులలో సగానికి పైగా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతుండటం గమనార్హం. దాదాపు 55 శాతం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి.

గత 24 గంటల్లో 497 మంది మృతి
ఈరోజు కరోనా కేసులు మరణాల సంఖ్య బాగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దేశంలో కరోనా మరణాలలోనూ పెరుగుదల కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే 497 మంది కరోనా వైరస్ తో మరణించారు ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో 40,013 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.12 కోట్ల మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. కొత్త కేసుల సంఖ్య కంటే కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం దేశానికి కాస్త ఊరట కలిగించే అంశం.

దేశంలో 3,86,381 క్రియాశీల కేసులు
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య నాలుగు లక్షల కంటే తక్కువగానే ఉంది. మొత్తం 3,86,381 క్రియాశీల కేసులు దేశంలో ఉన్నాయి. ఇక క్రియాశీల కేసుల రేటు 1.21 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనల మధ్య వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసిన ప్రభుత్వం గత 24 గంటల్లో 41,38, 646 మందికి వాక్సినేషన్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య దాదాపు 52 కోట్లకు చేరుకుంది.

కేరళ రోజువారీ కేసుల నమోదులో ఫస్ట్ ప్లేస్.. టాప్ 5 రాష్ట్రాలివే
ఇక దేశంలో అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 21,119 కేసులు నమోదయ్యాయి. ఇక కేరళ రాష్ట్రం 152 మరణాలను కూడా నివేదించింది. నిన్న, రాష్ట్రంలో 13,049 కేసులు మరియు 105 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 5,609 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 137 మంది మరణించారు. ఆ తరువాత 1,893 కోవిడ్ కేసులతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 1,461 కేసులతో, 1338 కేసులతో కర్ణాటక కేసులు ఎక్కువగా ఉన్న ఇతర దక్షిణాది రాష్ట్రాలు.
Recommended Video

ఈశాన్య రాష్ట్రాలలోనూ పెరుగుతున్న కేసులు
494 కేసులతో తెలంగాణ 1,000 కంటే తక్కువ కేసులు ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రంగా ఉంది. 929 తాజా కోవిడ్ కేసులతో, అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో ఒకే రోజు అత్యధిక కేసులతో ముందంజలో ఉంది. అస్సాం తర్వాత మిజోరం 863 కేసులు, మణిపూర్ 633 కేసులు, మేఘాలయ 411 కేసులు నమోదు చేశాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ల వినియోగం, వ్యాక్సిన్లు ఏ మేరకు కరోనాను కట్టడి చేస్తాయి అన్న దానిపై జోరుగా పరిశోధనలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications