భారత్ లో కరోనా : పెరుగుతున్న యాక్టివ్ కేసులతో ఆందోళన, తాజా కేసుల్లో 70 శాతం కేరళ నుండే
భారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 42,909 కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క కోవిడ్ చార్ట్ నేడు కాస్త మెరుగుదల చూపించింది. దేశంలో ఈరోజు నమోదైన కేసులు నిన్నటి కంటే 4.7% తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో సుమారు 380 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాలలో కూడా కాస్త తగ్గుదల కనిపిస్తోంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.15% గా ఉన్నాయి.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు, తగ్గుతున్న రికవరీలు
దేశంలో యాక్టివ్ కేసులు 3,76,324 కి పెరిగాయి. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 1.15% గా ఉంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 97.51 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 34,763 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 3.19 కోట్ల మంది కరోనాను జయించిన వారు. ప్రస్తుతం రోజువారీ సానుకూలత రేటు 3.02 శాతంగా ఉంది. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈరోజు కేసులలో 70 శాతం కేసులు కేరళ రాష్ట్రంలోనే
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దాదాపు 63.43 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి. గత 24 గంటల్లో 31 లక్షలకు పైగా డోస్‌లు ఇవ్వబడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో నమోదైన కేసులలో 70 శాతం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం భారతదేశానికి ఆందోళన కలిగిస్తున్న అంశం. గత 24 గంటల్లో కేరళ 29,836 కరోనా కేసులను నమోదు చేసింది. ఇప్పటివరకు కరోనా కారణంగా కేరళ రాష్ట్రంలో నమోదైన బాధితుల సంఖ్య 40,07,408 కి చేరుకుంది. పరీక్ష సానుకూలత రేటు 20 శాతానికి దగ్గరగా ఉంది.
మహారాష్ట్రలోనూ కొనసాగుతున్న కరోనా ఆందోళన
75 మరణాలతో, కేరళ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 20,541 కి పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక డేటా విడుదల చేసింది. ఇదిలా ఉంటే కేరళలో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు మొదటి టీకాను పొందారు. మహారాష్ట్రలో తాజాగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,666 కాగా, మొత్తంగా నమోదైన కేసులు 64,56,939 కి చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 131 కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి.ఇదిలా ఉంటే గోవాలో, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోవిడ్ -19 ప్రేరిత రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూను సెప్టెంబర్ 6 వరకు పొడిగించింది. 24 గంటల కర్ఫ్యూ మొదటగా ఈ ఏడాది మే 9 న విధించబడింది.
ప్రపంచ వ్యాప్తంగా కేసులు ఎన్నంటే
కోవిడ్ కోసం ఆర్టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించటం భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రయాణానికి తప్పనిసరి చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11, 2020 న కరోనా వ్యాప్తిని మహమ్మారిగా ప్రకటించింది. ఈ రోజు వరకు, ప్రపంచవ్యాప్తంగా 214.42 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. 4.47 మిలియన్లకు పైగా మరణాలు సంభవించాయని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంకా తగ్గకుండా కరోనా కల్లోలం సృష్టిస్తుంది. మరోవైపు భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications