భారత్ లో కరోనా : 30లక్షలకు పైగా యాక్టివ్ కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు, తాజా లెక్కలు ఇవే !!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. విపరీతంగా పెరుగుతున్న కేసులు, మరణాలతో భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 3.8 లక్షలకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అటు మరణాలలోనూ రికార్డు స్థాయిలో ఒకే రోజులో 3,645 మంది మృత్యువాత పడటం తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.

భారీగా గత 24 గంటల్లో 3,79,257 కేసులు
భారతదేశంలో గత 24 గంటల్లో 3,79,257 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో ఈ రోజు మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకుంది. భారతదేశం ప్రతి వారం 3 లక్షలకు పైగా కొత్త కేసులను నమోదు చేసిన పరిస్థితి ఏప్రిల్ 22 వ తేదీ నుండి కొనసాగుతుంది. ఏప్రిల్ 22న మొదటిసారిగా భారతదేశం 314,835 కేసులను నమోదు చేసింది.అప్పటినుండి ఇప్పటివరకు ఎనిమిది రోజులుగా మూడు లక్షలకు పైగా కేసులను నమోదు చేస్తూనే ఉంది.

ముప్పై లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
విపరీతంగా కేసులు నమోదు కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 30,84,814 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో 2,69,507 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దీనితో భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 1,50,86,878 మంది కోలుకున్నారు.నిన్న ఒక్కరోజే మరణించిన వారి సంఖ్య 3,645 కాగా తాజా మరణాల తరువాత దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 2.04 లక్షలకు చేరుకుంది.

2 లక్షలు దాటిన మరణాలు , ప్రపంచంలో మరణాల్లో నాలుగో స్థానం
ఈ ప్రాణాంతక మహమ్మారికి వ్యతిరేకంగా ఇప్పటివరకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 15,00,20,648 మందికి ఇప్పటివరకు టీకాలు వేశారు. దాదాపు 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది.కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2,00,000 మరణాలను దాటిన నాలుగోదేశంగా భారతదేశం బుధవారం నిలిచింది.యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ మరియు మెక్సికో తర్వాత నాలుగో దేశంగా భారతదేశం ఉండటం గమనార్హం.

రోజువారీ కేసుల నమోదులో టాప్ 3 రాష్ట్రాలు ఇవే
ఒక రోజులో నమోదైన కొత్త కోవిడ్ -19 మరణాలలో మహారాష్ట్ర,ఢిల్లీ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో అధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా తాజా రోజువారీ కొత్త కేసులు 66,358 గా నమోదయ్యాయి. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో 32,921, కేరళలో 32,819 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా తాజా పరిణామాల నేపథ్యంలో మరోమారు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన చివరి అస్త్రాన్ని ప్రయోగించాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న ఆలోచన అందరిలో వ్యక్తమౌతుంది. మే రెండు తర్వాత లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లుగా దేశవ్యాప్త చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications