ఒకరి నుండి కరోనా ఎంత మందికి వ్యాపిస్తుందో తెలుసా..షాకింగ్ విషయం చెప్పిన కేంద్రం!!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది . రోజువారీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి భారతదేశాన్ని రోజురోజుకు దారుణ స్థితికి చేరుస్తుంది. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ బారిన పడిన ఒక వ్యక్తి నుండి ఎంతమందికి కరోనా సోకే అవకాశం ఉంది అన్న దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

నియమాలు పాటించకుంటే ఒకరి నుండి వందల సంఖ్యలోనే కరోనా
కరోనా సోకిన ఒక వ్యక్తి నుండి భౌతిక దూరం పాటించకపోతే, మాస్క్ ధరించకపోతే ఒకరి నుండి దాదాపు 406 మందికి కరోనా సోకే అవకాశం ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది . ఇది ఒక చైన్ లా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది . చాలామంది కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకొని తమకు కరోనా సోకినట్లుగా నిర్ధారించుకుంటున్నారు. కానీ ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ బారినపడిన వారు మాత్రం,ఈ మహమ్మారిని తీవ్రంగా వ్యాప్తి చేస్తున్నారు.

సామాజిక దూరం పాటించి, మాస్కులు పెట్టుకోవటం చేస్తే ఎంతగా కంట్రోల్ అవుతుందంటే
లక్షణాలు ఉన్నా, లేకున్నా ఏదేమైనా సామాజిక దూరం పాటించి, అందరూ మాస్కులు సక్రమంగా ధరించి కరోనా నిబంధనలను అమలు చేస్తే ఈ వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుందని కేంద్రం చెబుతోంది. 50 శాతం సామాజిక దూరం పాటిస్తే వైరస్ వ్యాప్తి 15 మందికి పరిమితం చేయొచ్చని, కనీసం 75 శాతం నిబంధనలు పాటించినా నెల రోజుల్లో 2 నుండి 5 మందికి వైరస్ వ్యాప్తి జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి జరుగుతున్నా, ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా నిబంధనలు తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరించటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు చెప్తున్నారు.

కరోనా రెండో దశ ఉధృతంగా .. ప్రజలు ఉండాల్సిందే అప్రమత్తంగా
ఏది ఏమైనా కరోనా రెండవ దశ చాలా ఉధృతంగా ఉన్న ఈ సమయంలో దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. ప్రతినిత్యం ఆసుపత్రులలో మరణమృదంగం మోగుతోంది. కరోనా బాధితులకు వైద్య సదుపాయాల కొరత తీవ్ర ఇబ్బందిగా మారింది. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం భరించలేని విధంగా వైద్యం అందని ద్రాక్షగా తయారైంది. ఈ కారణాలతోనైనా ఎవరికి వారు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కరోనా మహమ్మారి విషయంలో తస్మాత్ జాగ్రత్త!!
స్వీయ నియంత్రణ పాటించడం,సామాజిక దూరాన్నిపాటించడం,మాస్కులు ధరించడం,అనవసరంగా బయట తిరగకుండా క్రమశిక్షణతో ప్రవర్తించడం ప్రస్తుతం ఒక అవసరంగా మారింది. ఒక వ్యక్తి దాదాపు 406 మందికి కరోనాని వ్యాప్తి చేసే అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. అందుకే కరోనా మహమ్మారి విషయంలో తస్మాత్ జాగ్రత్త!!












Click it and Unblock the Notifications