వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్‌: పీఎం కేర్స్ ఫండ్‌తో అందించిన వెంటిలేటర్లపై ఆరోపణలెందుకు వస్తున్నాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పిఎం కేర్స్ ఫండ్ కింద జారీ చేసిన వెంటిలేటర్ల నాణ్యత పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పీఎం కేర్స్ ఫండ్ కింద జారీ చేసిన వెంటిలేటర్ల నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ వెంటిలేటర్లు కోవిడ్ రోగులకు ఉపయోగపడవని ఆసుపత్రి సాంకేతిక కమిటీ ఓ నివేదికలో తెలిపింది.

ఈ నివేదికను హాస్పిటల్ డీన్ డాక్టర్ కానన్ ఏలికర్ కూడా ధృవీకరించారు. వెంటిలేటర్లు దేనికైతే కేటాయించారో ఆ అవసరానికి ఉపయోగపడట్లేదని ఆమె అన్నారు.

దీనిపై వివరణ తీసుకోవడానికి బీబీసీ ఆసుపత్రి వర్గాలను సంప్రదించలేకపోయింది.

ఈ నివేదికపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఈ అంశంపై విచారణ జరగాలని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. అయితే, వెంటిలేటర్లు ఉపయోగించకుండా ఎందుకు వదిలేశారని బీజేపీ ప్రశ్నిస్తోంది.

పీఎం కేర్స్ ఫండ్ కింద అందించిన వెంటిలేటర్లపై పంజాబ్, రాజస్థాన్‌ల నుంచి కూడా ఫిర్యాదులున్నాయి.

వెంటిలేటర్లు కోవిడ్ రోగులకు ఉపయోగపడట్లేదు

కోవిడ్ మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటళ్లకు పీఎం కేర్స్ ఫండ్ కింద వెంటిలేటర్లు, వైద్య పరికరాలు అందచేశారు. ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా కొన్ని వెంటిలేటర్లు అందాయి.

ఆసుపత్రి సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక గురించి బీబీసీ ఔరంగాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ కానన్ ఏలికర్‌తో మాట్లాడింది.

"వెంటిలేటర్లు ఉపయోగపడవు అని సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ తరహా వెంటిలేటర్లలో లోపాలు ఉన్నాయని చెప్పింది. ఆ సంస్థ టెక్నీషియన్లు ఆ సమస్యను పరిష్కరించడానికి పరిష్కరిస్తున్నారు. వారు చేయగలుగుతున్నారు" అని ఆమె చెప్పారు.

మే 6న సాంకేతిక కమిటీ నివేదిక సమర్పించింది.

గత సంవత్సరం ఇచ్చిన వెంటిలేటర్లు బాగానే పనిచేశాయని, వాటిలో లోపాలు లేవని డాక్టర్‌ ఏలికర్‌ అన్నారు.

దేశ వ్యాప్తంగా 7500 వెంటిలేటర్లను వివిధ ఆసుపత్రులకు ఇచ్చినట్లు నివేదికలు వచ్చాయి

సాంకేతిక కమిటీ నివేదిక ఏం చెబుతోంది?

ఏప్రిల్ 18న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆరో నంబర్ ఐసీయూ వార్డులో వెంటిలేటర్లను పెట్టారు. ఆ తర్వాత వెంటిలేటర్ల సంస్థ టెక్నీషియన్లు వాటిని పరిశీలించారు.

నివేదికలో ముఖ్యంగా టెక్నికల్ కమిటీ నాలుగు అంశాలను పొందుపరిచింది.

  1. ఈ వెంటిలేటర్లను కోవిడ్ రోగులకు వాడాల్సి ఉంది, కానీ అవి వారికి ఉపయోగపడట్లేదు.
  2. ఈ వెంటిలేటర్లలో టైడల్‌ వాల్యూమ్‌ (ఊపిరి పీల్చి వదిలిన గాలి పట్టేంత పరిమాణం) లేదు.
  3. ఇవి రోగులకు ఉపయోగకరంగా లేవు
  4. వీటిని ఐసీయూల్లో వాడటం సాధ్యం కాదు.

ఆసుపత్రి ఇచ్చిన నివేదిక ప్రకారం వెంటిలేటర్ల సంస్థ ప్రతినిధులు వచ్చి వెంటిలేటర్లకు మరమ్మతులు చేశారు. ఆ తర్వాత వాటిని రోగులకు వాడారు. కానీ, అవి రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెంచేందుకు ఉపయోగపడలేదు.

ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి జ్యోతి సీఎన్‌సీ అనే సంస్థ వెంటిలేటర్లను సరఫరా చేసింది. ఈ సంస్థ సరఫరా చేసిన థమన్-1 వెంటిలేటర్ల గురించి అహ్మదాబాద్‌లోని కొంత మంది డాక్టర్లు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆర్డర్లు ఇదే సంస్థకు ఇచ్చారు.

విచారణకు డిమాండ్

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన పీఎం కేర్స్ ఫండ్ మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. పీఎం కేర్స్ ఫండ్‌కు వచ్చిన నిధులకు ఆడిట్ జరగాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తూనే ఉంది.

ఔరంగాబాద్ ఆసుపత్రి వెంటిలేటర్లకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేసింది.

దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే స్పందించారు.

"పీఎం కేర్స్ ఫండ్ కింద అందించిన వెంటిలేటర్ల గురించి మరీ ఎక్కువ స్థాయిలో ఫిర్యాదులు లేవు. కొన్ని ఆసుపత్రులు ఫిర్యాదులు చేశాయి. వాటిని మరమ్మతు చేసేందుకు సాంకేతిక సిబ్బందిని పంపిస్తే వెంటిలేటర్లను వాడవచ్చు. అవి పనికిరాకపోవడం అంటూ ఏమీ లేదు. కొన్ని చోట్ల లోపాలు ఉండి ఉండవచ్చు. వాటిని భద్రంగా ఉంచడంలో కొన్ని సమస్యలు ఉండి ఉండవచ్చు. చాలా వెంటిలేటర్లను వాడుతున్నారు. ఉపయోగంలో లేని వెంటిలేటర్లను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి టెక్నీషియన్ల సహాయంతో వాటిని నిర్వహించేలా చూస్తాం" అని రాజేష్ టోపే చెప్పారు.

"కేంద్రం మహారాష్ట్రకు సరఫరా చేసిన వెంటిలేటర్లపై రాష్ట్రం విచారణ చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. ఇదో పెద్ద మోసమని, పీఎం కేర్స్ ఫండ్ పేరుతో ప్రజా ధనం వ్యర్థమైందని అన్నారు.

"పారదర్శకత లేని ఈ నిధికి దేశంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నిటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు వసూలు చేసింది. పీఎం కేర్స్ ఫండ్ విషయంలో సమాచార హక్కు ద్వారా ప్రశ్నించే అవకాశాన్ని ప్రభుత్వం నిషేధించింది" అని సావంత్ చెప్పారు.

పీఎం కేర్స్ ఫండ్ కింద ఇచ్చిన వెంటిలేటర్లు పనికి రాకుండా పక్కన పడి ఉండటం నాసిక్‌లో కనిపించింది.

రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వెంటిలేటర్ల గురించి ఫిర్యాదులు ఉన్నాయి.

"నాసిక్‌కు 60 వెంటిలేటర్లు ఇచ్చారు. కానీ, వెంటిలేటర్ల విడి భాగాలు లభించకపోవడం వల్ల వాటిని వినియోగించడం కుదరట్లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి" అని సచిన్ సావంత్ చెప్పారు.

కనెక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లే వెంటిలేటర్లు వాడలేదని నాసిక్ మున్సిపల్ అధికారులు చెప్పారు.

"ఔరంగాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఇచ్చిన 75 వెంటిలేటర్లలో 25 వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు. కానీ, అవి నాణ్యమైనవి కావని ఆసుపత్రి నివేదిక ఇచ్చింది" అని ఎన్సీపీ ఎమ్మెల్యే సతీష్ చవాన్ చెప్పారు.

"దేశవ్యాప్తంగా 7500 వెంటిలేటర్లను వివిధ ఆసుపత్రులకు ఇచ్చినట్లు నివేదికలు వచ్చాయి. వీటిపై నిపుణులతో విచారణ చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌, ఎన్సీపీల డిమాండ్‌పై బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్‌ ఉపాధ్యాయ్ స్పందించారు.

"వెంటిలేటర్ల నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేని పక్షంలో తప్పకుండా విచారణ చేయాలి. కానీ, వెంటిలేటర్లు వాడకుండా ఎందుకుంచారనే అంశంపై ప్రభుత్వం విచారణ చేయాలి" అని కేశవ్ ఉపాధ్యాయ్ అన్నారు.

పిఎం కేర్స్ ఫండ్ కింద జారీ చేసిన వెంటిలేటర్ల నాణ్యత పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా?

ఔరంగాబాద్ మెడికల్ కాలేజీకి ఇచ్చిన వెంటిలేటర్ల నాణ్యతపై విచారణ చేస్తారా అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను మీడియా ప్రశ్నించింది.

పుణెలోని చాలా వెంటిలేటర్లు పని చేయడం లేదు. వాటిని పుణె మున్సిపల్ కార్పొరేషన్ మరమ్మతు చేయించింది. బహుశా మరమ్మతు చేయడానికి ఔరంగాబాద్‌లో నిపుణులు ఉండి ఉండరు. సంబంధిత సంస్థ వివరాలను పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఔరంగాబాద్ మెడికల్ కాలేజీ అందిస్తారు" అని ఆయన చెప్పారు.

"వెంటిలేటర్లలో లోపాలు వేలెత్తి చూపే బదులు వాటిని మరమ్మతు చేయించడం మంచిది కదా" అని ఆయన అన్నారు.

వెంటిలేటర్లపై ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదులు

పంజాబ్‌లోని మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన 320 వెంటిలేటర్లలో కనీసం 237 లోపాలతో కూడుకుని ఉన్నట్లు 'ది హిందూ' పత్రిక రాసింది.

వెంటిలేటర్ల నాణ్యత గురించి ఫిర్యాదు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది.

"వెంటిలేటర్లు అకస్మాత్తుగా పని చేయడం మానేస్తాయి. చాలాసార్లు ప్రెజర్‌ తగ్గిపోతుంది. వాటికి ఆక్సిజన్ సెన్సార్లు లేవు. దాంతో, రోగికి ఎంత ఆక్సిజన్ వెళ్తోందో అర్ధం కాదు" అని ఉదయపూర్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ డాక్టర్ లఖన్ పోస్వాల్ చెప్పారు.

పీఎం కేర్స్ ఫండ్ కింద జారీ చేసిన వెంటిలేటర్ల పై బీబీసీ చేసిన ఫ్యాక్ట్ చెక్:

58,850 వెంటిలేటర్లను ఆర్డర్ చేయగా, 30,000 వెంటిలేటర్లు ఖరీదు చేశారు.

వీటిని కరోనా మొదటి వేవ్ తర్వాత ఖరీదు చేశారు.

బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో వెంటిలేటర్లు సరిగ్గా పని చేయడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Ventilators supplied with PM Cares Fund are being charged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X