కార్పోరేట్ లీక్ ట్విస్ట్: విచారణలో షాకింగ్, కీలక పత్రాలు పాక్‌కు అమ్మారా?
న్యూఢిల్లీ: కార్పోరేట్ గూఢచర్యం కేసులో కొత్త మలుపు! కార్పోరేట్ గూఢచర్యం కేసులో అరెస్టైన ప్రయాస్ జైన్, తాను దొంగిలించిన కీలక పత్రాలను శత్రుదేశం పాకిస్తాన్‌తో పాటు చైనా దేశానికి విక్రయించాడా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జైన్ వెబ్‌సైట్‌ను పరిశీలించిన విచారణాధికారులు.. అందులో కొంతమంది విదేశీయులు ఉన్నారని గుర్తించారు.
అంతేకాకుండా విచారణలో భాగంగా విదేశాలకు చెందిన 250 మంది దాకా వ్యక్తులు సంస్థలు తన క్లయింట్ల జాబితాలో ఉన్నట్లు ప్రయాస్ జైన్ అంగీకరించాడని సమాచారం. ఈ క్లయింట్లందరు ఇంధన, బొగ్గు, చమురు రంగాలకు చెందిన వారని అతను వెల్లడించాడు.
కార్పోరేట్ గూఢచర్యం కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు తెలిసినట్లుగా తెలుస్తోంది. ఇందులో దాదాపు వంద పత్రాల వరకు ప్రధాని కార్యాలయానికి చేరకముందే లీక్ అయ్యాయని సమాచారం. అంతేకాదు, కొన్ని పత్రాల పైన సంతకాలు కూడా కాలేదని తెలుస్తోంది.
కార్పోరేట్ గూఢచర్యం కేసులో నాలుగు రోజుల క్రితం పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొంతమంది అరెస్టయ్యారు. అందులో ప్రముఖ కంపెనీలకు చెందిన వారు కూడా ఉన్నారు. పోలీసులు శనివారం వరకు 12 మందిని అరెస్టు చేశారు. ఇది కోట్లాది రూపాయల విలువైన కుంభకోణంగా అనుమానిస్తున్నారు.

శాస్త్రి భవన్‌కు నిందితులు
ఆదివారం నాడు ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు దర్యాఫ్తులో భాగంగా శాస్త్రి భవన్‌లోని చమురు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. ఈ వ్యవహారం అంతటిని ఎలా నడిపించారో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి, సాక్ష్యాలు సేకరించేందుకు లల్తా ప్రసాద్, రాకేష్ కుమార్ అనే నిందితులను తీసుకు వెళ్లారు.
తస్కరించిన పత్రాలను వారు తమ కంపెనీల లబ్ధి కోసం ఏ విధంగా ఉపయోగించిందీ తెలుసుకోవడానికి క్రై బ్రాంచి ప్రయత్నిస్తోంది. ప్రముఖ చమురు సంస్థ ఉన్నతాధికారులు ఇద్దరిని విచారించేందుకు పోలీసులు సమన్లు జారీ చేశారని, అయితే వారిలో ఒకరికి స్వైన్ ఫ్లూ సోకగా, మరొకరు విదేశాల్లో ఉన్నారని తెలుస్తోంది.
మా కార్యాలయాలపై దాడులు జరగలేదు: రిలయన్స్
తమ కార్యాలయాల పైన దాడులు జరగలేదని, తాము పోలీసుల విచారణకు సహకరిస్తామని అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులు సోమవారం తెలిపారు. తాము చట్టవ్యతిరేక పనులను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించమని చెప్పారు.












Click it and Unblock the Notifications