వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం పరిహారంలో అవినీతి.. ఆధారాలతో దొరికిపోయిన అధికారులు.. అందరి బండారం బయటపడేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

మడెం పోడయ్య అనే గిరిజన రైతుది ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం ఉప్పేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడెం. 172, 66, 25 సర్వే నెంబర్లలో ఆయనకు ఉన్న అయిదెకరాల భూమిని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది.

’రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్’ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద ఆయనకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈలోగానే సర్వే పూర్తికావడంతో భూమి పట్టా, పాసు పుస్తకాల జిరాక్స్ తీసుకురావాలని రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది చెప్పడంతో పోడయ్య వాటిని అందించారు. పాస్ పుస్తకాల జిరాక్స్ తీసి ఇచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పోడయ్యకు రావాల్సిన పరిహారం మధ్యలో దళారులే మింగేశారు.

ఎంతకాలం వేచిచూసినా తన భూమికి చట్టం ప్రకారం రావాల్సిన పరిహారం అందడం లేదని నిర్వాసిత రైతు, అధికారులకు ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయ్యింది. రికార్డుల్లో తనకు పరిహారం చెల్లించినట్టు ఉండడంతో లబోదిబోమనడం బాధితుడి వంతయింది. తనకు అన్యాయం జరిగిందని, ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో దర్యాప్తు జరుపగా, నకిలీ రసీదులు సృష్టించిన రెవెన్యూ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో వీఆర్ఏను సస్పెండ్ చేశారు.

పోడయ్యలాగా మోసపోయినవారు వందల మంది ఉన్నారు. తరతరాలుగా వారు నమ్ముకున్న భూమి, ఇల్లు సహా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని కాజేస్తున్న వ్యవహారంలో వీఆర్ఏలు, వీఆర్వోలు లాంటి క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా స్పెషల్ కలెక్టర్ వరకు పలువురి అవినీతి వెలుగులోకి వచ్చింది.

తహశీల్దార్ స్థాయి అధికారులు అరెస్ట్ అయి, జైలు పాలయ్యారు. ఈ బాగోతం వెనుక అసలు సూత్రధారులు వేరే ఉన్నారని, వారి సంగతి కూడా తేల్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. పునరావాస ప్యాకేజీ విషయంలో అవినీతిపరులు ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదని ప్రభుత్వం చెబుతోంది.

పోలవరం

ఎంత ఇవ్వాలి?

పోలవరం నిర్వాసితులకు 2009కి ముందే ఓ విడత పరిహారం చెల్లించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే పరిహారం చెల్లించి, పునరావాసం కూడా కల్పించారు. అప్పట్లో గ్రామసభలు నిర్వహించి నిర్ధారించిన కుటుంబాల ప్రాతిపదికన ఎకరానికి లక్షన్నర రూపాయల చొప్పున చెల్లించారు. పునరావాస కాలనీలు నిర్మించి గృహవసతి కల్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.

అప్పటి నుంచి పునరావాసం చెల్లింపుల్లో అవకతవకల మీద అనేక ఆరోపణలున్నాయి. అక్రమాలు జరిగిన తీరు మీద పలువురు ఆధారాలతో నిలదీశారు. వాటి మీద దర్యాప్తులు జరుపుతూ కింద స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.

2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం ప్యాకేజీ బాగా పెరిగింది. భూమికి భూమి కల్పించడం, కాలనీల నిర్మాణంతోపాటు ముంపు బారిన పడే ప్రతీ ఎకరానికి చెల్లించాల్సిన నష్టపరిహారం మూడు రెట్లు పెరిగింది. అప్పటికే కొంత మొత్తం చెల్లించడంతో దానికి అదనంగా ఒక్కో రైతుకు కొంత మొత్తం చెల్లించి ఇచ్చేందుకు చంద్రబాబునాయుడి హయంలో కొంత ప్రయత్నం జరిగింది.

అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారంలోకి వస్తే, అదనంగా ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల చొప్పున అదనపు పరిహారం ఇస్తామని నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ పరిహారం చెల్లింపులో జాప్యం జరగడంతో పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు దక్కాల్సిన మొత్తం కూడా పెరుగుతోంది. అదే సమయంలో, దీనిపై వెచ్చించాల్సిన మొత్తం ప్రభుత్వాలకూ భారం అవుతూ వస్తోంది.

ప్యాకేజీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టులో 77 శాతం హెడ్ వర్క్స్, 93 శాతం కుడికాలువ పనులు, 72 ఎడమ కాలువ పనులు పూర్తయినట్టు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రూ. 15,667.9 కోట్లు వెచ్చించినట్టు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. అందులో రూ. 12,311.16 కోట్లను జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్టు ప్రకటించింది.

అవసరమైన భూసేకరణలో కేవలం 67 శాతం మాత్రమే జరిగిందని చెబుతూ, ’ఆర్ అండ్ ఆర్’ కేవలం ఏడు శాతం మాత్రమే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాస్త పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ’ఆర్ అండ్ ఆర్’ ప్యాకేజీ చెల్లింపు మాత్రం నత్తనడకన సాగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి.

మొత్తం 320 ఆవాసాలు ముంపు బారిన పడుతుండగా, పూర్తిగా పరిహారం చెల్లించేందుకు కనీసం మరో రూ. 29 వేల కోట్లు అవసరం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తొలుత 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో మునిగిపోయే ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది.

ఇటీవల గోదావరి వరద బాధితుల పరామర్శ కోసం చింతూరులో పర్యటించిన సమయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సెప్టెంబర్ ఆఖరుకు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం

అక్రమాలకు హద్దులేదు

పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయి 17 ఏళ్లవుతున్నా, నేటికీ ఏడు శాతం మందికే ’ఆర్ అండ్ ఆర్’ ప్యాకేజీ చెల్లించామని ప్రభుత్వమే చెబుతోంది. అలా చెల్లించిన వారి విషయంలో కూడా అనేక సెటిల్‌మెంట్లు పెండింగులో ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. కాలనీల నిర్మాణం పూర్తికాలేదనే వాదన ఉంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకూ అనేక ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

ఈ ప్రాజెక్టుతో తమకు మాత్రం ఎలాంటి ప్రయోజనమూ లేకపోగా, తాము నివసించే ప్రాంతం, సాగు చేసుకునే భూమి, తరతరాలుగా నమ్ముకున్న అడవి.. అన్నీ నీళ్లపాలవుతున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని వారు రెండు, మూడేళ్లుగా చెబుతున్నారు.

"ఆర్ అండ్ ఆర్‌కు అవసరమైన నిధుల విడుదలలో కేంద్రం, రాష్ట్రం జాప్యం చేస్తున్నాయి. ఇక వచ్చిన వాటిని కూడా కొందరు దర్జాగా కాజేస్తున్నారు. గిరిజనుల భూముల మీద నకిలీ పత్రాలు సృష్టించి కొందరు, లేని వివాదాలు రాజేసి మరికొందరు, బాధితులకు తెలియకుండా ఇంకా కొన్ని చోట్ల... ఇలా రకరకాల పద్ధతుల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నా, చర్యలు అరకొరగానే ఉన్నాయి. దర్యాప్తు జరిగిన ప్రతీ ఫిర్యాదులోనూ ఎవరో ఒకరిని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తోందంటే ప్యాకేజీ చెల్లింపులో అక్రమాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు" అని చింతూరు ప్రాంత జర్నలిస్ట్ ఎం.వినయ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

పరిహారం చెల్లింపులో ప్రభుత్వ తాత్సారం ఒక సమస్య అయితే, ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు నిర్వాసితులకు చేరకపోవడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు

పోలీసు కేసులు, రెవెన్యూ అధికారుల అరెస్టులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న దేవీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నం. 45/2022 కింద ’ఆర్ అండ్ ఆర్’ ప్యాకేజీలో అక్రమాలపై కేసు నమోదయ్యింది. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు పెట్టిన ఈ కేసులో ఐపీసీ 420, 409, 468, 477 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.

ఈ కేసులో దేవీపట్నం తహశీల్దార్ వీర్రాజు సహా పలువురు రెవెన్యూ సిబ్బంది అరెస్ట్ అయ్యారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి బాధితులను మోసగించడం, ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించడం, ఇతర నేరాలకు పాల్పడినట్టు నిందితుల రిమాండ్ రిపోర్టులో రంపచోడవరం ఏఎస్పీ రాశారు. డి పట్టా భూముల పరిహారానికి కేటాయించిన దాదాపు 2.4 కోట్ల రూపాయలను నిధులను కాజేసినట్టు ఏఎస్పీ నిర్ధరించారు.

ఈ కేసులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సహా కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉందని దర్యాప్తులో తేలడంతో అందరినీ అరెస్టు చేసేందుకు నోటీసులు ఇచ్చినట్టు జులై 6న కోర్టులో సమర్పించిన రిపోర్టులో వివరించారు.

నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అవినీతిపరుల జేబుల్లోకి పోవడంపై సమగ్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి.

"రెవెన్యూ అధికారులు కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ పోలవరం ప్రాజెక్టు భూ సేకరణ జరిగిన తీరు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. చట్టాలకు తూట్లు పొడిచి కోట్ల రూపాయలు అన్యాక్రాంతం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి. కానీ గుబ్బలపాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీలో వెలుగులోకి వచ్చిన కేసులో మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగిస్తే అధికారులు, నాయకులు అందరి గుట్టూ బయటపడుతుంది" అని రాజకీయ పరిశీలకుడు పి.అచ్యుత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.

’ఆర్ అండ్ ఆర్’ చెల్లింపులో నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో 'ఏజెన్సీ గిరిజన సంఘం' తరపున కోర్టుకు వెళ్లిన నిర్వాసితులతో పోలిస్తే అదే పంచాయతీలోని ఇతర గ్రామాల నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం తక్కువగా ఉందని, రెండింటికీ పొంతనే లేదని వివరించారు.

ముంపు గ్రామాల్లో ఒకటైన తాళ్లూరు నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయించామని ఆయన బీబీసీకి తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు మ్యాప్

అరకొర చర్యలు సరిపోవు’.. గిరిజన సంఘం

మండల స్థాయి అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోకుండా, మొత్తం ఆర్ అండ్ ఆర్ నిధుల వినియోగం మీద సోషల్ ఆడిట్ జరగాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రాంబాబు డిమాండ్ చేశారు.

"ఎల్టీఆర్పీ పేరుతో గిరిజనుల భూములకు దక్కాల్సిన పరిహారం కూడా అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం 7 శాతం ప్యాకేజీ చెల్లింపులోనే వందల మందికి అన్యాయం జరిగింది. లబ్దిదారులకు దక్కకుండా మధ్యలో దళారులు, ప్రభుత్వ సిబ్బంది కాజేశారు. మిగిలిన నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించాల్సి ఉన్నందున ఇప్పటివరకు వరకు జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట పడాలి. లేదంటే అవినీతి వ్యవహారాలు మరింత విస్తృతమవుతాయి. పాలక పక్షం నేతల పాత్ర కూడా బయటపెట్టాలి. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన గిరిజనులకు దక్కాల్సిన ప్యాకేజీ సక్రమంగా చెల్లించేందుకు ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి" అని ఆయన కోరారు.

అరకొర చర్యలతో సరిపెట్టకుండా సమగ్ర చర్యలు తీసుకుంటేనే మళ్లీ చేతివాటం ప్రదర్శించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందని, లేదంటే గిరిజనుల అమాయకత్వాన్ని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకునే ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

పోలవరం

అవినీతిని సహించబోం’.. మంత్రి రాజన్నదొర

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవినీతిలో అధికార పార్టీ నేతల పాత్ర ఉందనే ఆరోపణలను బీబీసీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్నదొర వద్ద ప్రస్తావించింది.

గిరిజనులకు, ముఖ్యంగా పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన సమాధానమిచ్చారు.

"పోలవరం ఆర్ అండ్ ఆర్ చెల్లింపులో అక్కడక్కడా అక్రమాలు బయటపడుతున్నాయి. వాటిని అరికడుతున్నాం. కఠినంగా స్పందిస్తున్నాం. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వంటి వారి మీద కూడా చర్యలకు సిద్ధమయ్యాం.’’అన్నారు రాజన్న దొర.

''నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా పరిహారం చెల్లింపులో సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటాం" అని ఆయన చెప్పారు. నిర్వాసితులకు పునరావాస కాలనీల నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. త్వరలోనే 41.15 మీటర్ల లోపులో ఉండే వారందరికీ తొలి విడతలో పరిహారం చెల్లింపు పూర్తి చేస్తామని రాజన్న దొర చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corruption in Polavaram compensation.. Officials caught with evidence.. Will everyone's treasure be revealed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X