కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ గ్రీన్ సిగ్నల్: ఇక విదేశాలకూ..
జెనీవా/న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ టీకాకు ఎట్టకేలకు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లభించింది. ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ లిస్టింగ్-ఈయూఎల్) చేర్చేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది.
ఈ మేరకు బుధవారం డబ్ల్యూహెచ్ఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ ఈయూఎల్ ఆమోదం లభించడంతో కోవాగ్జిన్ టీకాను ప్రపంచ దేశాలకు అందించేందుకు మార్గం సుగమమైంది. ఈ టీకాను తీసుకున్న ఇక్కడి పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆంక్షలు గానీ, స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం గానీ ఉండదు.

అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు భారత్ బయోటెక్ తొలిసారి ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. దీనిపై పలుమార్లు నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలపై డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది. ఆ తర్వాత ఈయూఎల్ లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది.
కాగా, ఇప్పటికే భారతదేశంలో కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినయోగంగా ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసుల్లో తీసుకునే ఈ టీకా కరోనాతోపాటు పలు వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. మనదేశంలో కోవాగ్జిన్ తోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా పంపిణీ చేస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాను కూడా అందిస్తున్నారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను 18 ఏళ్లు నిండినవారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా, 10,68,514 మంది నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసులకు 3.43 కోట్లకు చేరింది. మంగళవారం 311 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 14,159 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.37 కోట్లకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు 252 రోజుల కనిష్టానికి తగ్గాయి. పాజిటివిటీ రేటు 0.44 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.22 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. మంగళవారం 41,16,230 మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 107 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications