వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్ మృతునికి అంత్యక్రియలు

కోవిడ్‌తో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారంగా చెల్లించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ - ఎన్‌డీఎంఏ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

కేంద్రం బుధవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడించింది.

ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు రూపొందించాలంటూ ఈ ఏడాది జూన్ 30న సుప్రీంకోర్టు ఎన్‌డీఎంఏను ఆదేశించిన మేరకు ఆ సంస్థ ఈ సిఫారసులు చేసింది.

ఈ పరిహారాన్ని రాష్ట్రాలు అందిస్తాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

కోవిడ్ మృతులకు అంత్యక్రియలు

కోవిడ్ సహాయ చర్యలలో పాల్గొన్నవారు, కోవిడ్‌ సన్నద్ధ చర్యలలో పాల్గొన్నవారు ఎవరైనా ఈ వైరస్ సోకి మరణిస్తే వారికీ పరిహారం వర్తిస్తుందని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

అయితే, కోవిడ్‌తో మరణించినట్లు ధ్రువపత్రం ఉంటేనే పరిహారం అందుతుంది.

ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఏడాది సెప్టెంబరు 3న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తారు.

పరిహారం ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?

రాష్ట్రాల విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్‌డీఆర్ఎఫ్) నిధి నుంచి ఈ చెల్లింపులు చేస్తారని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

ఎస్‌డీఆర్ఎఫ్ విడుదల చేసే పరిహారం నిధులను జిల్లాల విపత్తు నిర్వహణ సంస్థలు(డీడీఎంఏ) ద్వారా బాధితుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తారు.

ఎప్పటి వరకు వర్తిస్తుంది?

2020లో దేశంలో తొలి కోవిడ్ మరణం నమోదైనప్పటి నుంచి ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారికి ఇది వర్తిస్తుంది.

మొదటి, రెండు వేవ్‌లలో మరణించినవారితో పాటు భవిష్యత్‌లో అలాంటి తీవ్రమైన వేవ్ మళ్లీ వచ్చి ఎవరైనా మరణించినా వారికీ ఈ పరిహారం వర్తిస్తుంది.

పరిహారానికి సంబంధించిన మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

మృతుల కుటుంబీకులు

క్లెయిం చేయడం ఎలా? ఎన్ని రోజుల్లో పరిహారం అందుతుంది?

కోవిడ్ పరిహారం కోసం రాష్ట్రాలు అందుబాటులో ఉంచే నిర్దేశిత ఫారాలను నింపాలి.

దానికి కోవిడ్‌తో చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలి.

ఈ దరఖాస్తులను డీడీఎంఏలు పరిశీలించి అర్హత ఉందని నిర్ధరిస్తే వారికి పరిహారం అందుతుంది.

దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా క్లెయింలు పరిష్కరించాల్సి ఉంటుంది.

పరిహారానికి అర్హత ఉందని డీడీఎంఏ నిర్ధరిస్తే 30 రోజుల్లోగా అర్హుల బ్యాంకు ఖాతాకు ప్రత్యక్షంగా నగదు బదిలీ అవుతుంది.

ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉండాలి.

కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లో డెత్ సర్టిఫికేట్ల కోసం వేచి ఉన్న మృతుల బంధువులు

కోవిడ్ మరణ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన సమస్యలుంటే..

పరిహారం పొందే ప్రక్రియలో ప్రధానమైనది మరణ ధ్రువీకరణ పత్రం. క్లెయిం ఫారానికి జత చేసే మరణ ధ్రువీకరణ పత్రంలో ఆ మరణం కోవిడ్ వల్ల సంభవించినట్లుగా ఉండాలి.

కోవిడ్ మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి జిల్లాల స్థాయిలో కమిటీలను నియమించాలని ఎన్‌డీఎంఏ సూచించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌లు సంయుక్తంగా విడుదల చేసిన సెప్టెంబరు 3 నాటి మార్గదర్శకాల ప్రకారం ఈ కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి.

బాధిత కుటుంబాల(క్లెయిం చేసినవారు) సమస్య తెలుసుకున్న తరువాత వాస్తవాల ప్రాతిపదికన సవరించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసే అధికారం ఈ కమిటీకి ఉంటుంది.

ఒకవేళ క్లెయిం చేసుకున్నవారికి ప్రతికూలంగా నిర్ణయం తీసుకుంటే అందుకు గల కారణాలను ఈ కమిటీ రికార్డు చేయాల్సి ఉంటుంది.

ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే..

* అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్

* చీఫ్ మెడికల్ ఆఫీసర్

* అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కానీ, ఆ జిల్లాలోని వైద్య కళాశాల ప్రిన్సిపల్ లేదా హెచ్‌ఓడీ కానీ..

* సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్

https://twitter.com/ANI/status/1440885260305121283

ఎంతమంది అర్హులు?

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా(సెప్టెంబర్ 23, 2021 వరకు) వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 4,46,050 మంది కోవిడ్‌తో మరణించారు.

కేంద్రం ప్రకటన ప్రకారం వీరంతా పరిహారానికి అర్హులే.

ఎక్కువ మరణాలున్న 10 రాష్ట్రాలు (2021 సెప్టెంబరు 23 వరకు)

మహారాష్ట్ర1,38,664

కర్ణాటక37,668

తమిళనాడు35,400

దిల్లీ 25,085

కేరళ24,039

ఉత్తర్ ప్రదేశ్22,888

పశ్చిమ్ బెంగాల్18,691

పంజాబ్16,501

ఆంధ్రప్రదేశ్14,097

ఛత్తీస్‌గఢ్13,563

తెలుగు రాష్ట్రాలలో...

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 14,097 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 3,908.

ఇప్పటికే పరిహారం ప్రకటించిన రాష్ట్రాలు

కోవిడ్‌తో మరణించినవారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి.

దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామని ఇంతకుముందే ప్రకటించింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది.

బిహార్ ప్రభుత్వం కోవిడ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పింది.

(ఆధారం: సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Covid 19:How to get the money Rs.50000 that was annouced to the families of deceased
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X