భారత్‌లో కరోనా విలయం: రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు కేంద్రం పిలుపు - కట్టడిపై రేపు హర్ష వర్ధన్ భేటీ
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. వైరస్ పుట్టిన ఏడాదిన్నర తర్వాత ఒకే రోజు కొత్త కేసులు లక్ష మార్కును దాటడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. దేశవ్యాప్తంగా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ సెకండ్ వేవ్ పై సమీక్ష నిర్వహించగా, అందులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా..
కొవిడ్-19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మంగళవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కరోనా మహమ్మారి కట్టడిపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర అధికారులు వెల్లడించారు.

కొవిడ్ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే స్కూళ్లు, విద్యాసంస్ధలను మూసివేశాయి. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు కఠిన నియంత్రణలను అమలు చేస్తున్నాయి. రేపటి సమావేశం తర్వాత కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశముంది.
కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు, 478 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల పరంగా భారత్ లో లక్ష మార్కు దాటడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు, మరణాల సంఖ్య 1,65,101కి పెరిగాయి. రికవరీల సంఖ్య 1,16,82,136కి చేరగా, ప్రస్తుతం 7,41,830 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7 కోట్ల 91 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications