కరోనా:దేశంలో కొత్తగా 47వేల కేసులు -భారత్‌లోనూ సెకండ్ వేవ్ భయం
11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిరిగి లాక్ డౌన్ ప్రకటించాయి. భారత్ కు కూడా ఆ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసుల పరంగా అదింకా నిర్ధారణ కావాల్సి ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కలు ఇలా ఉన్నాయి..
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 46,964 కరోనా పాజిటివ్ కేసులు, 470 మరణాలు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 81,84,083కు, మరణాల సంఖ్య 1,22,111కు చేరినట్లయింది. దేశంలో మరణాల రేటు మార్పు లేకుండా... 1.5 శాతంగానే ఉంది. ప్రపంచ దేశాలలో అది 2.59 శాతంగా ఉంది.

కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 58,684 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 74,91,513కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు మరింత పెరిగి 91.5 శాతానికి చేరింది.
ఆదివారం ఉదయం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 5,70,458గా ఉంది. శనివారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 10,31,239 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 10,98,87,303 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications