కోవిడ్: మూడో రోజుల్లో పెళ్లి.. వరుడు మృతి - ప్రెస్ రివ్యూ

మరో మూడు రోజుల్లో పెళ్లి బాజాలు మోగుతాయనుకున్న ఇంట్లో విషాదం నెలకొందని.. కరోనాతో వరుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారని 'ఈనాడు' కథనం రాసింది.

''సాలూరు మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కురుకుట్టి గ్రామంలోని ఓ బ్యాంకులో బ్యాంకు మిత్రగా పనిచేస్తున్న చిన్నపాత్రుని మనోహర్(22)కి ఈ నెల 23న వివాహం జరగాల్సి ఉంది.

13న ఆయనకు జ్వరం రావడంతో తోణాం పీహెచ్‌సీలో పరీక్షలు చేయించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.

హోం ఐసోలేషన్‌లో ఉంటానని మనోహర్ కోరినప్పటికీ ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడంతో బొబ్బిలి ఆసుపత్రికి రిఫర్ చేశారు.

అక్కడ నుంచి ఆయన విజయనగరంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి మారారు.

వారం నుంచి అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటాక మరణించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పాలని నిర్ణయించుకున్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.

ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

దీనికి కొంత కారణం ఆక్సిజన్‌ కొరత. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో ఆయన ఆక్సిజన్‌ బ్యాంక్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని సంకల్పించారు.

మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆక్సిజన్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుందని రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

కార్యక్రమాలన్నీ రామ్‌చరణ్‌ మానిటర్‌ చేస్తారని, మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఓ ట్విట్టర్‌ ఖాతాను కూడా ప్రారంభించారని ఈ వార్తలో రాశారు.

వ్యాక్సీన్

తెలంగాణలో సూపర్‌ స్ప్రెడర్లకు ముందుగా కోవిడ్ వ్యాక్సీన్

'సూపర్‌ స్ప్రెడర్లు’.. తమకు తెలియకుండానే ఏదైనా వ్యాధిని తన ద్వారా ఎక్కువమందికి వ్యాప్తి చేసే వాహకులను ఇలా పిలుస్తారు. వీరిని గుర్తించి, ముందుగా టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా సుమారు 7-8 కేటగిరీలకు చెందిన సూపర్‌ స్ప్రెడర్లు (వైరస్‌ వాహకులు) సుమారు 15 లక్షలమంది ఉంటారని అంచనా. ఇందులోనూ 18-44 ఏళ్ల మధ్యవయస్కులు వీరిలో అత్యధికులు ఉంటారని భావిస్తున్నారు.

ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వినియోగించే వాహనచోదకులు మొదలుకొని.. మనింటికి వేర్వేరు రూపాల్లో ఆహార పదార్థాలనో, వస్తువులనో పార్శిళ్ల రూపంలో తీసుకొచ్చే వ్యక్తుల వరకూ పలు వృత్తులవారు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఉంటారని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది.

ఇటువంటి వారికి తొలుత రెండు డోసుల టీకాలను వేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఎక్కువగా బయట తిరుగుతుంటారు కనుక వారికి ముందుగా వ్యాక్సిన్‌ ఇస్తే కోవిడ్‌ బారినపడే అవకాశాలు తక్కువ ఉంటాయని.. ఒకవేళ కరోనా సోకినా వైరస్‌ లోడ్‌ తక్కువ ఉంటుంది కనుక వ్యాప్తి తగ్గుతుందని భావిస్తున్నారు.

ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించగా.. ఈ సూచన బాగుందంటూ ప్రధాని మోదీ అభినందించిన విషయం తెలిసిందే.

ఈ విషయమై ఇటీవల రాష్ట్రంలోని ఉన్నతస్థాయి అధికారులు చర్చించారు. త్వరలోనే 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుండడంతో.. ఆ సమయంలో 'సూపర్‌ స్ప్రెడర్లు’గా భావిస్తున్న వ్యక్తులకు తొలుత టీకాలందించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీనివల్ల వ్యాప్తిని చాలావరకూ అరికట్టవచ్చని భావిస్తున్నట్టు తెలియవచ్చింది.

ఎక్కువమందిని కలుస్తూ సూపర్‌ స్ప్రెడర్లుగా మారడానికి అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా వేయడం ద్వారా.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని సర్కారు నిర్ణయించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

18-44 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాలను పంపిణీ చేసే క్రమంలో బ్యాంకు ఉద్యోగులు, న్యాయవాదులు, పాత్రికేయులకు కూడా ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారుల భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. నిత్యం ఎక్కువమందిని కలవాల్సిన పరిస్థితులు వీరికి ఉంటాయని ఈ మేరకు చర్చించినట్లు వైద్యవర్గాలు తెలిపాయని ఈ కథనంలో రాశారు.

విశాఖలో మొట్టమొదటి డిస్ట్రాయర్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌కు ఘనంగా వీడ్కోలు

'రాజ్‌ కరేగా రాజ్‌పుత్‌...’ అనే నినాదంతో నాలుగు దశాబ్దాల పాటు సాగర జలాల్ని భద్రతా వ్యవహారాల్లో పాలించిన ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ సేవల నుంచి నిష్క్రమించనుందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ని విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో శుక్రవారం డీ కమిషన్‌ చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

41 ఏళ్ల పాటు అవిశ్రాంత సేవలు అందించిన రాజ్‌పుత్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు చేసింది.

నాదెజ్నీ(ఆశ) పేరుతో 1961లో సోవియట్‌ యూనియన్‌లోని నికోలావ్‌ (ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఉంది)లో ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ నిర్మాణాన్ని చేపట్టారు.

1977, సెప్టెంబర్‌ 17న సేవలు ప్రారంభించగా.. 1980, మే 4న తేదీన జార్జియాలోని యూఎస్‌ఎస్‌ఆర్‌లో భారత రాయబారి ఐ.కె. గుజ్రాల్‌ సమక్షంలో ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌గా పేరు మార్చి, భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి, జాతికి అంకితం చేశారు.

అప్పటి నుంచి భారత సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మొట్టమొదటి గైడెడ్‌ క్షిపణి డిస్ట్రాయర్‌గా 41 ఏళ్ల పాటు రాజ్‌పుత్‌ సుదీర్ఘ సేవలందించింది.

దేశాన్ని ఎల్లపుడూ సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సహాయంగా ఆపరేషన్‌ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్‌ విధుల కోసం ఆపరేషన్‌ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు అపరేషన్‌ కాక్టస్, లక్షద్వీప్‌కు చెందిన క్రోవ్‌నెస్ట్‌ ఆపరేషన్‌లో రాజ్‌పుత్‌ పాల్గొంది.

వివిధ సందర్భాల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొంది. 41 ఏళ్ల ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ప్రస్థానంలో 31 మంది కమాండింగ్‌ ఆఫీసర్లుగా వ్యవహరించారు.

బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణికి ట్రయల్‌ ప్లాట్‌ఫామ్‌గా రాజ్‌పుత్‌ సేవలందించింది. 2005లో ధనుష్‌ బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని కూడా రాజ్‌పుత్‌ నుంచి ట్రాక్‌ చేశారు. 2007 మార్చిలో పృథ్వి–3 క్షిపణిని ఈ యుద్ధ నౌక నుంచి పరీక్షించారు.

నౌకాదళానికి అవిశ్రాంత సేవలందించిన రాజ్‌పుత్‌కు ఘన వీడ్కోలు పలకనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించనున్నారు

సూర్యాస్తమయ సమయంలో భారత నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ నిష్క్రమించనుంది. రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తించిన పలువురు అధికారుల్ని సత్కరించేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసిందని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+