వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 20 రోజుల కిందట వ్యాక్సీన్ తీసుకున్న 8 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా వ్యాక్సినేషన్

తెలంగాణలో కోవిడ్ టీకా తీసుకున్న వైద్య సిబ్బంది కొందరు కరోనా బారిన పడ్డారని.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలోని 8 మంది వైద్య సిబ్బందికి మంగళవారం కరోనా నిర్ధారణ అయిందని 'ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 20 రోజుల క్రితం వీరు కోవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారని జిల్లా ప్రత్యేక ఉప వైద్యాధికారి ఉష చెప్పారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు వైద్యులు, ఆరుగురు సిబ్బంది కాగా.. ఒకరు మినహా అందరూ ఆపరేషన్‌ థియేటర్‌కు సంబంధించిన వారే. వీరిలో ఆరుగురు కోవిడ్‌ వార్డులో, ముగ్గురు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారిణి తెలిపారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర పోలీసు సిబ్బందికి కరోనా వ్యాక్సీన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండగా.. ఇంకా 40 శాతం మంది కూడా వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. సిబ్బందిని చైతన్యపరిచేందుకు పలుచోట్ల ప్రత్యేక అధికారులను నియమించారు.

రాష్ట్రంలో దాదాపు 60 వేల మంది పోలీసు సిబ్బందికి వ్యాక్సీన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. శాఖలో చాలామంది సిబ్బందికి రక్తపోటు, మధుమేహం తదితర అనారోగ్య సమస్యలున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేయించుకుంటే దుష్పరిణామాలు ఏవైనా ఉంటాయేమో అనే భయంతో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మంగళవారం నాటికి పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందిలో మొత్తం 49,998 మంది కొవిడ్‌ టీకాలు వేయించుకున్నారు. వైద్య సిబ్బందిని కూడా కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,43,483 మంది టీకా పొందారని ప్రజారోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు తెలిపారు.

ఇక తెలంగాణలో కొత్తగా 149 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. 86 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఏపీలో 70 కొత్త కేసులను గుర్తించారు.

మీది ఉద్యోగం కాదు.. సేవ.. మీకు ఇచ్చేది గౌరవ భృతి: సీఎం జగన్ లేఖ

''వలంటీర్‌ అంటే.. స్వచ్ఛంద సేవ! స్వచ్ఛంద సేవ చేసే వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి! కానీ... జీతభత్యాలు తీసుకునే వారిని వలంటీర్‌ అని ఎలా అంటారు? వారు చేసేది స్వచ్ఛంద సేవ ఎలా అవుతుంది?’’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం 4 పేజీల బహిరంగ లేఖ రాశారని 'ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 'న్యాయం కావాలి! గౌరవభృతి కాదు... కనీస వేతనం చెల్లించాలి’ అంటూ ఆందోళనకు దిగిన వలంటీర్లకు.. 'మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు.. స్వచ్ఛంద సేవ’ అని జగన్‌ సూటిగా చెప్పారు.

''99 శాతం మంది వలంటీర్లు తాము చేస్తున్నది సేవ అని, ఉద్యోగం కాదని మనసా వాచా కర్మేణా నమ్మారు కాబట్టే సమాజంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు వలంటీర్లకు సలాం చేస్తున్నాయి. ప్రతి మనిషీ వలంటీర్లకు గౌరవం ఇస్తున్నారు’’ అని జగన్‌ తెలిపారు.

''మీరు రోజుకు ఇన్ని గంటలు, పని చేయాలన్న నిబంధనలేవీ లేవు. పని ఉన్నప్పుడు మాత్రం సేవాభావంతో చేస్తున్నారు. ప్రజా సేవకులుగా మీకు రూ. 5 వేల చొప్పున ఇస్తున్నది జీతం కాదు. అది గౌరవ భృతి మాత్రమే’’ అని జగన్‌ వివరించారు.

వలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో తాను ఏం చెప్పానో గుర్తుకు తెచ్చుకోవాలని జగన్‌ సూచించారు. ''సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు రూ.5వేల గౌరవ వేతనంతో వలంటీరుగా నియమిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది’’ అని తెలిపారు.

''మీరు వలంటీర్లుగా కాకుండా, జీతాలు తీసుకుని ఇదే పని చేస్తుంటే పేద ప్రజల్లో ఒక్కరైనా మీకు గౌరవం ఇస్తారా? జీతం తీసుకుంటే మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా?’’ అని జగన్‌ ప్రశ్నించారు.

''ఈ గౌరవం మీకు దక్కకుండా చేసేందుకు, మొత్తంగా వలంటీర్‌ వ్యవస్థే లేకుం డా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురిచేసే వారికి, రెచ్చగొట్టే వారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందిగా.. మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని జగన్‌ కోరారు.

కొత్త కార్మిక చట్టాలతో 'వారానికి 4 రోజులే పని చేయొచ్చు’: కేంద్ర కార్మికశాఖ

దేశంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే డ్యూటీ చేసే రోజులు త్వరలో రాబోతున్నాయని.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల (లేబర్‌ కోడ్స్‌)తో ఈ అవకాశం ఏర్పడుతుందని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర తెలిపారని 'నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. కొత్త లేబర్‌ కోడ్స్‌ ప్రకారం సంస్థలు తమ ఉద్యోగులతో వారానికి 48 గంటలకు మించి పని చేయించుకోకూడదు. అయితే, రోజుకు 12 గంటల చొప్పున వారానికి నాలుగు రోజులు, 10 గంటల చొప్పున ఐదు రోజులు, 8 గంటల చొప్పున ఆరు రోజులు.. పని చేయించుకొనే అవకాశం ఉన్నదని మీడియాకు చంద్ర వివరించారు.

వారంలో ఎన్ని రోజులు పని చేయించుకోవాలన్నది సంస్థ ఇష్టమని.. ఉద్యోగి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

1. వేతనాలు 2. పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత 3. ఆరోగ్యం, పని పరిస్థితులు 4. సామాజిక భద్రత పేరుతో కేంద్రం 4 లేబర్‌ కోడ్స్‌ను తెచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

బ్యాంకు సమ్మె

మార్చి15,16 తేదీల్లో రెండు రోజుల బ్యాంకుల సమ్మె

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో బ్యాంకింగ్‌ సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయని 'నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పీఎస్బీల విక్రయ చర్యలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ మార్చి 15, 16వ తేదీల్లో బ్యాంక్‌ల సమ్మె చేపట్టనున్నట్టు తొమ్మిది బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల సంయుక్త కమిటీ ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) నిర్ణయించాయి.

మంగళవారం హైదరాబాద్‌లో యూఎఫ్‌బీయూ నేతలు సమావేశమై రెండు రోజుల ఆందోళనకు పిలుపునిచ్చాయి. గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటుపరం చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అదే విధంగా ఎయిరిండియా, బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌, ఐడీబీఐ బ్యాంక్‌, బీఈఎంఎల్‌ తదితర వాటిని విక్రయానికి పెడుతున్నట్టు మంత్రి విస్పష్టంగా పేర్కొన్నారు.

గడిచిన నాలుగేండ్లలో మోదీసర్కార్‌ 14 పీఎస్బీలను విలీనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌, మరో బీమా కంపెనీని అమ్మకానికి పెట్టింది. ఈ చర్యల పట్ల యూఎఫ్‌బీయూ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సమ్మెలో భాగంగా రాష్ట్ర రాజధానులు, ఇతర కేంద్రాల్లో ధర్నాలు, నల్లబ్యాడ్జీలను ధరించడం, పోస్టర్లను విడుదల చేయడం తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు యూఎఫ్‌బీయూ నేతలు వెల్లడించారు. ఈ సమ్మెలో ఇతర ప్రభుత్వ రంగ విత్త సంస్థల ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలని బెఫీ వైస్‌ ప్రెసిడెంట్‌ పి వెంకట రామయ్య కోరారు.

ఈ భేటీలో ఐడీబీఐ బ్యాంక్‌, పీఎస్బీల ప్రయివేటీకరణ, బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు, ఎల్‌ఐసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌, ఒక సాధారణ బీమా కంపెనీ ప్రయివేటీకరణ, బీమా రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐల అనుమతి తదితర సంస్కరణలపై చర్చించామన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయాలని ఏఐబీఓసీ జనరల్‌ సెక్రెటరీ సౌమ్యా దత్తా కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid positive for 8 medical personnel who were vaccinated in Telangana 20 days ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X