కరోనా విజృంభణ: తాజ్‌మహల్ సహా చారిత్రక కట్టడాల తాత్కాలిక మూసివేత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియంలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజ్ మహల్, పతేహ్ పూర్ సిక్రి, తదితర కట్టడాల సందర్శనకు అనుమతి లేదన్నారు.

గత సంవత్సరం కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ ఈ కట్టడాలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేశారు. అయితే, తాజాగా, గతంలో కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నారు.
బుధవారం ఒక్కరోజే 2 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కట్టడి కోసం కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కొత్త ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకొస్తున్నాయి.












Click it and Unblock the Notifications