• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి... ఇవీ రేట్లు - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

కోవిడ్

ప్రైవేటు ఆస్పత్రుల్లో 45 ఏళ్లు పైబడినవారికి టీకా వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, కేవలం 45 సంవత్సరాలు పైబడిన వారికే టీకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికే టీకా ఇవ్వాలని ఆదేశించింది. 18-44 మధ్యవయస్కులకు వ్యాక్సినేషన్‌ ఇప్పుడు లేదని వెల్లడించింది.

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.

కేంద్రం మూడోదశ టీకా మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతినివ్వలేదు.

ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్ద వేసే టీకాలను ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులు కేంద్రం సూచించిన ఖాతాలో డబ్బులు జమ చేసి.. ఆ రసీదును ప్రజారోగ్య సంచాలకుడికి ఇచ్చేవి.

ఆ మొత్తానికి సరిపడ వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌ నుంచి ఇచ్చేవారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు ఒకే ధర చెల్లించేవారు.

ఒక్కో డోసుకు రూ. 150 చొప్పున చెల్లించి ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసేవి. డోసు ధరకు అదనంగా రూ.100 సర్వీస్‌ చార్జీ కింద ప్రజల నుంచి వసూలు చేసేవి.

దాంతో ఒక్కో డోసు ఇప్పటివరకు రూ.250 దొరికేది. కానీ.. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కంపెనీల నుంచే టీకాలు కొనుక్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఆ మేరకు ధరలు పెరగనున్నాయి.

అంటే ప్రైవేటు టీకా కేంద్రాల్లో కొవాగ్జిన్‌ ధర ఒక్కో డోసుకు రూ.1300, కొవిషీల్డ్‌ అయితే రూ. 700 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఏపీలో బీసీల కోటా మరో పదేళ్లు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో బీసీల కోటా మరో పదేళ్లు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో విద్యాసంస్థలు, సర్వీసుల్లో వెనకబడిన కులాల(ఏ,బీ,సీ,డీ,ఈ)కు రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 2031 మే 31 వరకు వీటిని వర్తింపజేస్తారు.

ప్రైవేటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని.. పిల్లలు, భవనాలు, ఉపాధ్యాయులతో సహా అప్పగిస్తే పేరు మార్చకుండా ప్రభుత్వమే వాటిని నిర్వహించనుందని ఈనాడు రాసింది.

అప్పగించడానికి యాజమాన్యాలు ఇష్టపడకపోతే.. ఎయిడెడ్‌ పోస్టుల్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేసి పూర్తిగా ప్రైవేటు కళాశాలలుగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35% సీట్లను కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వం తీసుకోనుంది.

వీటిని పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు కేటాయించి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలను వర్తింపజేస్తారు.

ఈ మేరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం 2016లో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఈనాడు వివరించింది.

హోం ఐసొలేషన్

హోం ఐసొలేషన్‌లో లక్ష మందికి చికిత్స

ఏపీలో హోం ఐసొలేషన్‌లో లక్షమంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్‌ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

వీళ్లందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు 104 కాల్‌సెంటర్‌ వైద్యులు కూడా ఫోన్‌ ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు.

అంతేకాకుండా సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మరోవైపు కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.

ప్రస్తుతం 9,937 మంది బాధితులు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నారు. ప్రస్తుతమున్న 1.50 లక్షల యాక్టివ్‌ కేసుల్లో 37,760 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య పెరిగితే.. ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌ లక్షణాలు బయటపడగానే జాప్యం చేయకుండా 104కు కాల్‌ చేసి మందుల వివరాలు తెలుసుకోవడం లేదంటే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రావాలని సూచిస్తున్నారు.

మానసిక ఆందోళనతోనే చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారని అంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 558 ఆస్పత్రులు కోవిడ్‌ చికిత్స అందిస్తుండగా.. 44,559 పడకలు అందుబాటులో ఉన్నాయి.

సాధారణ మందులు వాడి చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. మానసికంగా కుంగిపోవద్దు. ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లండని నిపుణులు చెబుతున్నారని సాక్షి వివరించింది.

తెలంగాణలో ఇంటింటా జ్వర సర్వే

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రారంభమైందని నమస్తే తెలంగాణ పత్రిక వార్తాకథనం రాసింది.

కరోనా మహమ్మారిపై రాష్ట్రప్రభుత్వం భీకర యుద్ధం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బృహత్‌ కార్యక్రమానికి నడుంకట్టింది.

కరోనా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారిని మెరుగైన చికిత్సకోసం దవాఖానలకు తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నది.

ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాల సభ్యులు గ్రామాలు, పట్టణాలవారీగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబుచేస్తారు.

కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. హోం ఐసొలేషన్‌ అవసరమైనవారికి వెంటనే హెల్త్‌ కిట్లు అందజేస్తారు.

వైరల్‌ లోడ్‌ ఎక్కువ ఉన్నట్టు గమనిస్తే వారిని దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి, దవాఖానకు తరలించి చికిత్స అందిస్తారు. ప్రతి బృందంలో ఒక ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, పంచాయతీ లేదా మున్సిపల్‌ సిబ్బంది ఉంటారు.

అవసరమైతే అంగన్‌వాడీ, గ్రామాల్లో ఉండే స్వచ్ఛంద సంస్థల సభ్యులను కూడా బృందంలో భాగస్వాములను చేసుకొంటారు.

ప్రతి జిల్లాలో కరోనా హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటి సర్వే సందర్భంగా ప్రజలందరికీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఇస్తారు.

హైదరాబాద్‌లో 040-2111 1111 నంబర్‌ను ఇచ్చారు. ఈ నంబర్‌కు ఇప్పటి వరకు 1964 కాల్స్‌ వచ్చాయి. అత్యవసర వైద్యంకోసం ఎక్కువగా ఫోన్లు వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.

కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్ల ద్వారా హెల్త్‌కిట్లు పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid vaccination allowed in private hospitals in Telangana,Here are the rates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X