కరోనా సెకండ్ వేవ్- ఏప్రిల్లో అన్ని రోజులూ వ్యాక్సినేషన్-కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా పరిస్ధితి చూస్తుంటే ఐదు నెలల గరిష్టానికి చేరుకునేలా ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మరింత ముమ్మరంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ నెలలో అన్ని రోజులూ వ్యాక్సిన్ కేంద్రాలను తెరిచి ఉంచాలని నిర్ణయించింది.
ఏప్రిల్ నెలలో సెలవు దినాలతో పాటు అన్ని రోజులూ ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలను తెరిచి ఉంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్నకేసుల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఓవైపు కేసులు పెరుగుతుండటం, మరోవైపు వ్యాక్సిన్లు మిగిలిపోయి వృధా అయిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లకు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. భారీగా కేసులు నమోదవుతున్న చోట్ల 45 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని వర్గాలకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్రం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దేశంలో భారీ సంఖ్యలో ఉన్న వయో వర్గాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకుంది. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు వేసిన ప్రభుత్వం... ఆ తర్వాత 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు అవకాశం ఇచ్చింది. ఇవాళ్టి నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు.












Click it and Unblock the Notifications