వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాక్సీన్: టీకాలు వేయడం ప్రారంభించి ఆరు నెలలు, భారత్‌లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది ఎందుకు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి ఆరు నెలలు పూర్తైంది. కానీ ఇప్పటివరకూ దేశ జనాభాలో ఐదు శాతం ప్రజలకే వ్యాక్సీన్ లభించింది.

ప్రస్తుతం భారత్ రోజుకు సగటున 40 లక్షల మందికి టీకా వేస్తోంది.

ఈ ఏడాది చివరి నాటికి అందరికీ టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 80 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సీన్ వేయాల్సుంటుంది.

జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం టీకా డోసుల సరఫరా తగ్గిపోయి, కొత్త వ్యాక్సీన్లకు అనుమతులు లభించడం ఆలస్యం కావడంతో కొన్ని నెలలపాటు మందకొడిగా సాగింది.

అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలతోపాటూ చాలా దేశాలు టీకా డోసులు పొందడానికి నానా తంటాలూ పడుతున్నాయి.

కానీ, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైనప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారు అయిన భారత్ కూడా అదే పరిస్థితి ఎదుర్కోవచ్చని ఎవరూ ఊహించలేదు.

కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాక్సీన్ తయారీదారులకు సమయానికి ముందే ఆర్డర్ ఇవ్వలేదు.

ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో కేంద్రం 18 ఏళ్లు దాటిన అందరినీ వ్యాక్సీన్ పరిధిలోకి తీసుకురావాల్సి వచ్చింది. అంటే దాదాపు వంద కోట్ల మందికి వ్యాక్సీన్ వేసుకోవడానికి అర్హులన్నమాట.

భారత్‌లో టీకాకరణ

భారత్‌లో వ్యాక్సినేషన్ ఎలా నడుస్తోంది

ప్రభుత్వ గణాంకాల ప్రకారం జనవరి 16 నుంచి ఇప్పటివరకూ దేశంలో 38.76 కోట్లకు పైగా వ్యాక్సీన్ డోసులు వేశారు. వీరిలో దాదాపు 31.20 కోట్ల మంది వ్యాక్సీన్ రెండు డోసులూ వేయించుకోగా, 7.70 కోట్ల మంది ఒక్క డోసు మాత్రమే వేసుకున్నారు.

శుక్రవారం భారత్‌లో కొత్తగా 38,949 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి మే ప్రారంభంలో వచ్చిన కరోనా సెకండ్ వేవ్ పీక్ కేసుల్లో పదో వంతు కంటే తక్కువ.

కానీ, డాక్టర్లు మాత్రం మూడో వేవ్ కచ్చితంగా వస్తుందని చెబుతున్నారు. కొత్త కరోనా వేరియంట్స్ ప్రమాదం ఉన్నప్పటికీ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడమే దానికి కారణం అంటున్నారు.

రోజువారీ సగటు టీకా డోసుల సంఖ్య తగ్గడం గురించి కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో జెండర్ గ్యాప్ కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ డేటా ప్రకారం 14 శాతం కంటే తక్కువ మంది మహిళలకు టీకాలు వేస్తున్నారు. ఈ తేడా ఎక్కువగా గ్రామీణ భారతంలో కనిపిస్తోంది. మహిళలు ఇంటర్నెట్ పెద్దగా ఉపయోగించని ప్రాంతాల్లో వారు టీకా వేసుకోడానికి జంకడం, భయపడడం జరుగుతోంది. వీరితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సీన్ వేయించుకునే మహిళల శాతం ఎక్కువగా ఉంది.

"మన దేశంలో వ్యాక్సీన్ కార్యక్రమం ఇన్ని రోజుల తర్వాత కూడా మందకొడిగా ఎందుకు సాగుతోంది" అని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రశ్నించారు.

నగరంలో వ్యాక్సీన్ డోసులు అయిపోయాయని, దాని వల్ల చాలా ప్రభుత్వ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చిందని ఆయన మంగళవారం చెప్పారు.

భారత్‌లో టీకాకరణ

ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని జూన్‌లో కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది.

భారత్‌లో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సీన్ వేయాలంటే ప్రభుత్వానికి 180 కోట్ల డోసులు అవసరం అవుతాయి.

కేంద్రం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు కంపెనీల నుంచి ఎన్ని డోసుల కరోనా టీకా అందుబాటులో ఉంటాయో వివరాలు ఇచ్చింది.

దాని ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సీన్ 50 కోట్ల డోసులు, కోవాగ్జిన్ 40 కోట్లు, భారత కంపెనీ బయోలాజికల్-ఈ వ్యాక్సీన్ 30 కోట్లు, రష్యా స్పుత్నిక్ వ్యాక్సీన్ 10 కోట్లు, అహ్మదాబాద్‌లోని జైడస్-కాడిలా ZyCov-D వ్యాక్సీన్ 5 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని చెప్పింది.

కానీ, వ్యాక్సీన్ కొరత ఇప్పటికీ అలాగే ఉంది. నివేదికల ప్రకారం చూస్తే జులైలో ఈ టీకా కార్యక్రమం ప్రభుత్వ లక్ష్యం కంటే వెనకబడింది.

భారత్‌లో టీకాకరణ

భారత్ ఏయే వ్యాక్సీన్లు వేస్తోంది

భారత్‌లో ప్రస్తుత టీకా కార్యక్రమంలో మూడు కరోనా టీకాలు వేయడానికి అనుమతులు లభించాయి. వీటిలో ఆక్స్‌ఫోర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కోవిషీల్డ్, భారత కంపెనీ భారత్ బయోటెక్ కోవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్-వి ఉన్నాయి.

మోడెర్నా వ్యాక్సీన్ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం భారత ఫార్మా కంపెనీ సిప్లాకు కూడా అనుమతులు ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా కోవిడ్-19పై దాదాపు 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

కానీ, భారత్‌లో ఈ టీకా ఎన్ని డోసులు అందుబాటులోకి వస్తాయనేది ఇంకా స్పష్టంగా తెలీలేదు. ఇంకా చాలా కంపెనీలకు చెందిన కరోనా టీకాలు అప్రూవల్ కోసం రకరకాల స్టేజిల్లో ఉన్నాయి.

దేశంలో స్వచ్ఛంద వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోంది. అంటే వేసుకోవాలని అనుకున్న వారు టీకా వేసుకోవచ్చు. ప్రభుత్వ కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా టీకా వేస్తున్నారు. కానీ, డబ్బు చెల్లించిన వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా టీకా వేసుకోవచ్చు.

ప్రభుత్వ కేంద్రాలు, ఆరోగ్య సేవా కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా డోసులు అందించడానికి ప్రభుత్వం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తోంది.

భారత్‌లో టీకాకరణ

టీకా వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?

టీకా వేసుకున్న తర్వాత జ్వరం, చేయి నొప్పి, టీకా వేసిన చోట నొప్పి, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.

టీకా వేయించుకున్న తర్వాత 'అడ్వెర్స్ ఈవెంట్స్' పరిశీలించడానికి భారత్‌లో 34 ఏళ్ల నాటి సర్వేలెన్స్ ప్రోగ్రాం ఉంది.

ఇలాంటి కేసుల్లో పారదర్శకంగా రిపోర్ట్ చేయడంలో విఫలమైతే, టీకా గురించి ప్రజల్లో ఒక భయం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో మే 17 నాటికి టీకా వేయించుకున్న వారిలో 23 వేలకు పైగా ఎడ్వర్స్ ఈవెంట్స్ నమోదయ్యాయి.

వీటిలో ఎక్కువగా సాధారణ సైడ్ ఎఫెక్టులేనని చెప్పారు. అంటే, వీటిలో ఆందోళన, కళ్లు తిరగడం, జ్వరం, నొప్పి ఉన్నాయి.

సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న దాదాపు 700 కేసులు కూడా భారత ప్రభుత్వం పరిశీలించింది. జూన్ మధ్య నాటికి 488 మంది మరణించినట్లు సమాచారం ఇచ్చింది. అయితే టీకా వేసుకోవడం వల్లే ఇవి జరిగాయని అనుకోకూడదని తెలిపింది.

దానితోపాటూ ప్రభుత్వం కోవిడ్-19 వల్ల చనిపోయే ప్రమాదంతో పోలిస్తే, వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత చనిపోయే ముప్పు చాలా తక్కువగా ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Six months after vaccination, why vaccination is slow in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X