వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాక్సీన్: 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఉచితం కాదు: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
18 ఏళ్లు పైబడిన వారికి ఉచితం కాదు

దేశంలో వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వేసే టీకా ఉచితం కాదని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

మే 1 నుంచి టీకా తీసుకోవడానికి 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. వీరికీ ఇప్పటిలాగే ఉచితంగా వ్యాక్సీన్‌ అందుతుందేమోనని అందరూ భావించారు.

కానీ ప్రభుత్వ ప్రకటనను తరిచిచూస్తే అందులో ఉన్న గూడార్థం బోధపడుతుంది.

18 ఏళ్లపైబడిన వారు వ్యాక్సీన్‌ వేయించుకోవాలంటే బహిరంగ మార్కెట్లో కొనాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలనేది ఆ ప్రకటన సారాంశం అని ఈనాడు చెప్పింది.

ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కేంద్రీకృతంగా జరుగుతున్న వ్యాక్సీన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి కేంద్ర ప్రభుత్వం కొంతమేర తప్పుకొంది.

50% భారాన్ని తాను తీసుకొని మిగిలిన 50% భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టేసింది. దీనివల్ల తమ రాష్ట్ర పరిధిలోని ప్రజల డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యతను ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మోయాల్సి ఉంటుంది.

''కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇదివరకటిలాగానే కొనసాగుతుంది, వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లపైబడిన వారికే ఉచితంగా టీకా అందిస్తాం'' అని కేంద్రం సోమవారం జారీచేసిన ప్రకటనలో పేర్కొంది.

18 ఏళ్లపైబడిన వారందర్నీ కేంద్రం అర్హులుగా ప్రకటించింది తప్పితే వారందరికీ ఉచితంగా వ్యాక్సీన్‌ అందిస్తానని చెప్పలేదని పత్రిక రాసింది.

ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది. వ్యాక్సీన్‌ సంస్థలకు మార్కెట్‌ను తెరవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేంద్రం ప్రకటన వల్ల రాష్ట్రాల్లో ప్రజలు తమకు టీకా ఇవ్వాలని స్థానిక యంత్రాంగాలపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది.

అప్పుడు రాష్ట్రాలు సొంత డబ్బుపెట్టి వ్యాక్సీన్‌ కొనాల్సి వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. టీకా ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తిలో 50% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్‌కు ముందుగా నిర్ధారించిన ధర ప్రకారం విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.

అందులో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి, బహిరంగ మార్కెట్‌కు ఎంత సరఫరా చేయాలన్న స్పష్టమైన లక్ష్మణ రేఖలు గీయలేదు.

అందువల్ల అందుబాటులో ఉండే ఆ 50% కోసం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్‌ సంస్థలు పోటీపడితే ధరలు పెరిగిపోయి సామాన్యుడు కొనలేని స్థితి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారని ఈనాడు వివరించింది.

కరోనా థర్డ్ వేవ్

నవంబరులో తెలంగాణలో థర్డ్ వేవ్

నవంబర్‌లో తెలంగాణ ప్రజలకు థర్డ్ వేవ్ ముప్పు తప్పదని రాష్ట్ర వైద్య శాఖ భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు మూడో వేవ్‌ ముప్పు కూడా తప్పదా? మూడో వేవ్‌ రాకుండా ఉండాలంటే 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోవాల్సిందేనా?

వైద్య శాఖ వర్గాలు అవుననే అంటున్నాయి.

ఈ ఏడాది నవంబరు నాటికి రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోందని పత్రిక రాసింది.

మొదటిసారి వచ్చింది పెద్ద వేవ్‌ కానే కాదని, ఇప్పుడు వచ్చిందే అసలైన వేవ్‌ అని పేర్కొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకా వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

అయినప్పటికీ అంచనాలకు తగ్గట్లుగా ప్రజలు టీకా తీసుకోవడం లేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఆ వయసు పైబడిన వారు 2.62 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. అందరూ టీకా తీసుకోకపోతే 6 నెలల్లో థర్డ్‌ వేవ్‌ తప్పదని హెచ్చరిస్తోంది.

ప్రజలంతా టీకా తీసుకుంటే వైరస్‌ బలహీనపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. టీకా తీసుకోకపోతే వైరస్‌ మరింతగా పరివర్తన చెంది, విజృంభిస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం మన దగ్గర బీ-1617 వైరస్‌ వల్ల తీవ్రస్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇది డబుల్‌ మ్యుటెంట్‌ కావడంతోనే వ్యాప్తి రేటు వేగంగా ఉందని అంటున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ సునామీని తలపిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈసారి మార్చి రెండో వారంలో వేవ్‌ ప్రారంభమైతే కేవలం 4 వారాల్లోనే కేసులు, వ్యాప్తి రేటు 4 రెట్లు పెరిగాయి.

ఈ లెక్కన మే రెండో వారం వరకు కేసులు పీక్‌ స్టేజ్‌కి వస్తాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత కేసుల నమోదులో స్థిరత్వం వస్తుందని చెబుతున్నాయి. జూన్‌ చివరి నాటికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

మావోయిస్టు నేత జలంధర్ రెడ్డి లొంగుబాటు

మావోయిస్టు నేత జలంధర్ రెడ్డి ఏపీ డీజీపీ ముందు లొంగిపోయినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

గతంలో బలిమెలలో పోలీసులపై జరిగిన దాడి, ఐఏఎస్‌ అధికారి వినీల్‌ కృష్ణ కిడ్నాప్‌ ఘటనల్లో పాత్రధారి, మావోయిస్టు కీలక నేత.. ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్‌ కృష్ణ, మారన్న, కరుణ, శరత్‌ (40) మంగళవారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎదుట లొంగిపోయారని పత్రిక రాసింది.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా (పూర్వపు మెదక్‌ జిల్లా) మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన జలంధర్‌రెడ్డి ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా- ఒడిశా స్పెషల్‌ జోన్‌ కమిటీ (ఏవోబీ ఎస్‌జెడ్‌సీ) సభ్యుడిగా ఉన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి లోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళ వారం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు హింసాయుత మార్గంలో ఏదీ సాధించ లేరని, జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారని సాక్షి చెప్పింది.

లొంగిపోయేవారికి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందించడంతోపాటు పునరావాసం కల్పిస్తామన్నారు.

విప్లవం, నూతన ప్రజాస్వామ్యం అంటూ మావోయిస్టులు చేస్తున్న హింసాయుత కార్యకలాపాలపై గిరిజనులు, యువత తోపాటు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు.

ఇప్పటికే ఏవోబీలో మావోయిస్టులు పట్టు కోల్పో యారని, గత రెండేళ్లలో అనేక మంది లొంగి పోయారని వివరించారు.

జలంధర్‌రెడ్డిపై రూ.20 లక్షలు నగదు రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని ఆయన పునరావాసానికి వినియోగిస్తామమని డీజీపీ చెప్పారని సాక్షి వివరించింది.

థియేటర్లు మూత

తెలంగాణలో స్వచ్ఛందంగా సినిమా హాళ్లు మూత

కరోనా వల్ల జనం రాకపోవడంతో తెలంగాణలో థియేటర్లను మూసివేయాలని సినీ పంపిణీ, ప్రదర్శనదారులు నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో బుధవారం నుంచి థియేటర్లను మూసివేయాలని సినీ పంపిణీ, ప్రదర్శనదారులు స్వచ్ఛందంగా నిర్ణయించారు.

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రకటించారు.

కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుండటంతో నిర్వహణ వ్యయాలు రాబట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్లే థియేటర్లను మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిసిందని పత్రిక చెప్పింది.

స్వచ్ఛంద మూసివేత నుంచి 'వకీల్‌సాబ్‌' సినిమాను ప్రదర్శించే థియేటర్లను మినహాయిస్తున్నట్టు ప్రదర్శనదారులు ప్రకటించారు.

అంతకుముందు కర్ఫ్యూ నేపథ్యంలో సినిమా థియేటర్లు రాత్రి 8 గంటలకే మూ సివేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

నిబంధనలు అమలుచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు, థియేటర్లలో పనిచేసే సిబ్బంది, వెండర్లు విధిగా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలని సూచించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid Vaccine: Vaccine is not free for those over 18: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X