Delta plus variant: థర్డ్‌వేవ్ ముప్పు దాపురించిందా: ఆ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతోన్న కేసులు
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం, విధ్వంసకర పరిస్థితులు దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్నాయి. దీని బారిన పడిన అన్ని రాష్ట్రాలు కోలుకుంటోన్నాయి. లాక్‌డౌన్ నుంచి బయటపడుతోన్నాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందంటూ ఊపిరి పీల్చుకునే లోపే- దాని కొత్త రూపం విరుచుకు పడుతోంది. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus variant) జనాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కంటే శక్తిమంతమైన వైరస్ మ్యూటెంట్‌గా భావిస్తోన్నారు దీన్ని. దేశంలో థర్డ్‌వేవ్ ఏర్పడటానికి ఈ మ్యూటెంట్ ప్రధాన కారణమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Recommended Video
దీని ప్రభావం అప్పుడే మహారాష్ట్రలో ఆరంభమైనట్టే. మహారాష్ట్రలో థర్డ్‌వేవ్ సంకేతాలు కనిపిస్తోన్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కూడా మహారాష్ట్ర నుంచే పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. పుణె, నాసిక్, అహ్మద్ నగర్, కొల్హాపూర్, రత్నగిరి, బీడ్, పాల్‌ఘర్ వంటి జిల్లాల్లో సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైంది. ఇప్పుడు కూడా అవే జిల్లాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివిటీ రేటు రోజురోజుకూ తీవ్రమౌతోంది. వారం రోజులకు సంబంధించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే- 11 జిల్లాల్లో కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు అధికమౌతోంది.

బుధ, గురువారాల్లో రోజువారీ కేసుల సంఖ్య కూడా అక్కడ ఓ మోస్తరు స్థాయిలో పెరిగింది. ఈ నెల 16వ తేదీన చివరిసారిగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత 10 వేలకు దిగువకే కొత్త కేసులు వెలుగులోకి వచ్చినా.. ఇప్పుడు మళ్లీ వాటి సంఖ్య ఆ మార్క్‌ను దాటింది. సింధుదుర్గ్-1.21, రత్నగిరి-0.97, కొల్హాపూర్-0.79, సాంగ్లీ-0.57, సతారా-0.40, రాయగఢ్-0.39, పాల్‌ఘర్-0.24, షోలాపూర్-0.21, అహ్మద్‌నగర్-0.19, బీడ్-0.19, ఉస్మానాబాద్-0.17 శాతం మేర కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే- వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలవారీగా పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలించుకోవాలని పేర్కొన్నారు. ఆంక్షలను సడలించే విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దని, తొందరపాటు తగదనీ హెచ్చరించారు. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ప్రభావం రాష్ట్రంలో ఇంకా కనిపించలేదని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేసినప్పటికీ- అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications