హార్దిక్ పాండ్యా ఒక్కో రిస్ట్ వాచ్ విలువ రూ.2.5 కోట్లు: బిల్లులు లేకుండా..దుబాయ్ నుంచి
ముంబై: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. ఆయన కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేశారు ఒక్కో రిస్ట్ వాచీ విలువ రెండున్నర కోట్ల రూపాయలు. దుబాయ్‌లో వాటిని కొనుగోలు చేశారాయన. వాటికి సంబంధించిన ఎలాంటి బిల్లులు గానీ, రిసిప్ట్స్ గానీ ఆయన వద్ద లేవు. దీనితో కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Recommended Video
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడు హార్దిక్ పాండ్యా. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా సెమీఫైనల్స్ చేరలేకపోయింది. సూపర్ 12 దశలోనే తిరుగుముఖం పట్టింది. క్రికెటర్లు..ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకున్నారు. హార్దిక్ పాండ్యా మాత్రం ఫైనల్స్ అయిపోయేంత వరకూ దుబాయ్‌లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్స్ ముగిసింది.
దీనితో సోమవారం రాత్రి అతను దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్నారు. అంతకుముందే అతను దుబాయ్‌లో షాపింగ్ చేశారు. రెండు అత్యంత ఖరీదైన రిస్ట్ వాచీలను కొనుగోలు చేశారు. ఒక్కో రిస్ట్ వాచీ విలువ అక్షరాలా రెండున్నర కోట్ల రూపాయలు. అయిదు కోట్ల రూపాయలతో ఇలాంటి రెండు వాచీలను కొన్నారాయన. దానికి సంబంధించిన ఎలాంటి బిల్లులు గానీ, రిసిప్ట్‌లు గానీ హార్దిక్ పాండ్యా వద్ద లేవు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరువాత.. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ వాచీల వ్యవహారం బయటపడింది. హార్దిక్ పాండ్యా లగేజీ, ఇతర వస్తువులను తనిఖీ చేయగా.. ఈ రెండు రిస్ట్ వాచీలు కొన్నట్లు తేలింది. వాటికి సంబంధించిన బిల్లులను ఇవ్వాలంటూ కస్టమ్స్ అధికారులు కోరగా.. హార్దక్ పాండ్యా చేతులెత్తేశారు. బిల్లులను తీసుకోలేదంటూ బుకాయించారు. దీనితో ఈ రెండింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హార్దిక్ పాండ్యాకు వాచీలంటే మోజు ఎక్కువ. ఇలాంటి కోట్ల రూపాయల విలువ చేసే రిస్ట్ వాచీలు ఆయన వద్ద చాలా ఉన్నాయి. ఇదివరకు పటెక్ ఫిలిప్పె నాటిలస్ ప్లాటినమ్ 5711 రిస్ట్ వాచీని అతను కొన్నాడు. దాని విలువ అయిదు కోట్ల రూపాయలు. ఇదివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన సమయంలోనూ హార్దిక్ పాండ్యా సోదరుడు.. క్రికెటర్ కృనాల్ పాండ్యా కూడా ఇలాగే బిల్లులు లేకుండా ఖరీదైన వాచీలను కొన్న విషయం తెలిసిందే. అప్పట్లో వాటిని అధికారులు సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications