బంగారం పేస్ట్ చేసి సాక్స్ లో దాచి అక్రమ రవాణా; 2 కేజీల బంగారం పట్టుకున్న కస్టమ్స్ అధికారులు !!
బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు . ఎయిర్ పోర్ట్ పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు దొరక్కుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య తలపై పెట్టుకున్న విగ్గులో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తే ,కొందరు స్మగ్లర్లు కడుపులో, మలద్వారం వద్ద బంగారాన్ని దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. మిక్సర్ గ్రైండర్ లో, కటింగ్ ప్లయర్ లో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసిన ఘనులు కూడా లేకపోలేదు. ఇక అండర్ వేర్ లో దాచి అక్రమ రవాణాకు ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక తాజాగా బంగారాన్ని పేస్ట్ గా మార్చి కొత్తగా స్మగ్లింగ్ యత్నం చేశారు.
తాజాగా బంగారాన్ని కరిగించి పేస్టు లా చేసి కాళ్ళకు వేసుకునే సాక్సుల్లో పెట్టుకుని అక్రమ రవాణాకు పాల్పడటానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహ్రయిన్ ప్రయాణికుడి వద్దనుండి రెండు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఎయిర్ పోర్ట్ లో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అడ్డుకున్న అధికారులు అతన్ని పరిశీలించారు.

దీంతో అతను బంగారం దాచిన విషయం బయటకు వచ్చింది. బంగారాన్ని కరిగించి పేస్టు రూపంలో చేతులు, కాళ్లకు వేసుకున్న సాక్స్ లలో దాచినట్టుగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు, అతని వద్ద నుండి రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజుకో కొత్త మార్గంలో బంగారాన్ని అక్రమార్కులు తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కస్టమ్స్ అధికారులకు బంగారం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకోవడం పెద్ద తలనొప్పిగా తయారైంది. అయినప్పటికే ఈ మధ్య ఎయిర్ పోర్ట్ లలో బంగారం పట్టుబడటం నిత్య కృత్యంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications