సైబర్ క్రైమ్స్: ఎన్‌సిఆర్‌పి షాకింగ్ నివేదిక: 2022లో భారీగా యూపీఐ మోసాలు.. ఎన్నంటే!!
భారతదేశంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి .సైబర్ భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి, సైబర్ దాడులను నివారించడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ సైబర్ నేరాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికానికి మధ్య యూపీఐ మోసాలు 15.3 శాతం పెరిగాయి.

2022 ఆర్ధిక సంవత్సరంలో యూపీఐ మోసాలు ఇలా
ఎన్‌సిఆర్‌పి నివేదిక ప్రకారం డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ సంబంధిత మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధిత మోసాలతో సహా ఇతర సైబర్ నేరాలతో పోలిస్తే, 2022 క్యూ1 మరియు క్యూ2లో మొత్తంగా యుపిఐ మోసాలు 34% పెరిగాయని హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎన్సీ ఆర్పి నివేదిక ప్రకారం2022 మొదటి త్రైమాసికంలో 62,350 సంబంధిత మోసాలు నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 84,145 యూపీఏ సంబంధిత ఫిర్యాదులు నమోదయ్యాయి.

2022 మొదటి, రెండవ త్రైమాసికాల్లో మొత్తం యూపీఐ మోసాలిలా
2022 వ సంవత్సరం లోని మొదటి రెండవ త్రైమాసికం మధ్య యూపీఐ మోసాలు 15.3 శాతం పెరిగినట్లుగా నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో యూపీఐ లావాదేవీలు 1200% పెరిగాయి.
ఈ క్రమంలోనే యూపీఐ మోసాలు కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 2022 మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో మొత్తం 1,46,495 యూపీఐ మోసాలు నివేదించబడ్డాయి.

సైబర్ క్రైమ్ నేరాలలో 67.9% ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు
ఇక 2022 మొదటి త్రైమాసికంలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మరియు సిమ్ స్వాప్ మోసాలు 26,793 నమోదు కాగా, రెండవ త్రైమాసికంలో అవి 24,270కి పెరిగాయి. అంతేకాదు మరోవైపు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైబర్ ఫిర్యాదులు 2022 మొదటి త్రైమాసికంలో 20,443 నమోదు కాగా, 2022 రెండవ త్రైమాసికంలో అవి 19,267కి తగ్గాయి. ఇక అన్నిటికంటే ఆన్లైన్ ఆర్థిక మోసాలు విపరీతంగా జరిగాయని ఎన్‌సిఆర్‌పి నివేదిక పేర్కొంది. సైబర్ క్రైమ్ నేరాలలో 67.9% ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు ఉన్నట్టుగా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది

దేశంలో యూపీఐ లావాదేవీల పరిమాణం నెలవారీగా 4% పెరుగుదల
2022 సెప్టెంబరులో యూపీఐ 678 కోట్ల లావాదేవీలను మరియు అంతకుముందు ఆగస్టు నెలలో 657 కోట్ల రూపాయల లావాదేవీలను నిర్వహించిందని సమాచారం. దీనితో, యూపీఐ లావాదేవీల పరిమాణం నెలవారీగా 4% పెరిగి, రూ. 11.16 లక్షల మార్కును దాటింది.
ఏదేమైనా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో చోటుచేసుకుంటున్న సైబర్ మోసాల కట్టడికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజలలో కూడా దీని వినియోగం పై అవగాహన రావలసిన అవసరం ఉంది. లేదంటే ఇలా యూపీఐ మోసాలు భవిష్యత్తులో మరిన్ని పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications