120 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడ్డ పెను తుఫాన్- చివురుటాకులా వణికిన తీరం

Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ పంజా విసిరింది. కనివినీ ఎరుగని రీతిలో విరుచుకుపడింది. ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో ఒడిశాలోని ధమారా- హబాలిఖటి మధ్యన తీరాన్ని తాకింది. ఈ ప్రక్రియ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది.

అల్లకల్లోలం..

అర్ధరాత్రి దాటిన తరువాత 12:20 నిమిషాలకు తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ఆరంభమైంది. తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో సైక్లోన్ ఐ తీరం దాటింది. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసినట్లు సమాచారం అందింది.

Cyclone Dana makes landfall at dhamara and Habalikhati in Odisha

అతి భారీ వర్షాలు..

ఫలితంగా కొన్ని చోట్ల సముద్రం ముందుకు పొడుచుకొచ్చింది. దాదాపు 15 మీటర్ల వరకు ముందుకొచ్చింది. తీరం ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురైంది. తుఫాన్ ధాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాలు దీని బారిన పడ్డాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కంటి మీద కునుకు లేకుండా గడిపారక్కడి జనం.

అంధకారం..

120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో సహా నేలకూలాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆయా జిల్లాల్లో ఫోన్లు మూగబోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

హెల్ప్ లైన్లు..

ఒడిశాలో గంజాం (06811-263978), పూరీ (06752-223237), జగత్‌సింగ్ పూర్ (06724-220368), కేంద్రాపారా (06727-232803), భద్రక్ (06784-251881), బాలాసోర్ (06782-262286/261077), మయూర్‌భంజ్ (06792-252759/252941) జిల్లాలు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి.

కియొంఝర్ (06766-255437), జైపూర్ (06728-222648), ఢెంకనాల్ (06762-226507/221376), అంగుల్ (06764-230980), ఖుర్దా (06755-220002), నయాగఢ్ (06753-252978), కటక్ (0671-2507842) జిల్లాలు చివురుటాకుల్లా వణుకుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

కంట్రోల్ రూమ్..

ఆయా జిల్లాలన్నింట్లోనూ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం. దీనికి అదనంగా భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 1929 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

Cyclone Dana makes landfall at dhamara and Habalikhati in Odisha

బెంగాల్‌లో భీతావహం..

అటు ఇదే తరహా పరిస్థితులు పశ్చిమ బెంగాల్‌లోనూ నెలకొన్నాయి. కోల్‌కత, ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్, దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా, ఝాగ్రమ్, బాంకురా, హూగ్లీ, హౌరా జిల్లాలపై దానా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోన్నాయి.

స్కూళ్లకు సెలవులు..

తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను ప్రకటించాయి. తీరాన్ని ఖాళీ చేయించాయి. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బందిని మోహరింపజేశాయి.

తీరం ఖాళీ..

ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. ఒడిశాలో 4,17,626, పశ్చిమ బెంగాల్‌లో 2,43,374 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వారికోసం ప్రత్యేకంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఎయిర్‌పోర్టులు మూసివేత

తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 203 రైళ్లు రద్దయ్యాయి. విమానాల రాకపోకలను దారి మళ్లించారు. కోల్‌కత, భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాలను 16 గంటల పాటు మూసివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+