ప్రధాని మోడీ సైక్లోన్ రివ్యూ మీట్‌కి అరగంట ఆలస్యంగా మమతా బెనర్జీ, చీకటి రోజంటూ సువేందు ఫైర్
కోల్‌కతా: యాస్ తుఫాను ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ పాల్గొన్న సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అరగంట ఆలస్యంగా వచ్చారని సమాచారం. అంతేగాక, ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మమతా బెనర్జీ రాష్ట్రంలో తుఫాను నష్టంపై పత్రాలను అందజేసి ఇతర సమావేశాల కోసం వెళ్లిపోవడం గమనార్హం.
మమతా బెనర్జీ తీరుపై గవర్నర్ అసంతృప్తి
'పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు హాజరుకావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. ముఖాముఖి వైఖరి రాష్ట్ర లేదా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. సీఎం, అధికారులు పాల్గొనకపోవడం రాజ్యాంగబద్ధత లేదా చట్ట నియమాలతో సమకాలీకరించబడదు ' అని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
మోడీతో భేటీ అయ్యానంటూ మమత.. 20వేల కోట్లు కావాలంటూ..
అయితే, ప్రధాని మోడీ సమీక్ష సమావేశం గురించిన సమాచారం తనకు సరైన సమయంలో అందలేదని మమతా బెనర్జీ చెప్పారు. తాను ప్రధానమంత్రిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో తుఫాను కారణంగా కలిగిన నష్టాన్ని వివరించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఆ సమయానికి సమావేశ గదిలోకి ఎవరూ రాలేదని చెప్పారు. జరిగిన నష్టంపై పత్రాలను అందజేసిన మమతా బెనర్జీ.. రూ. 20వేల కోట్ల సాయాన్ని కోరారు. ఆ తర్వాత ఆమె సీఎస్ తోపాటు తుఫాను ప్రభావిత దిఘాకు వెళ్లిపోయారు.
సమావేశానికి సువేందు అధికారి.. చీకటి రోజంటూ
పశ్చిమ మిడినిపూర్ జిల్లాలోని కలైకుండలో ప్రధాని, బెంగల్ సీఎం సమావేశం శుక్రవారం 2.30గంటల నుంచి 3.30గంటల మధ్య షెడ్యూల్ చేయబడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానితో ప్రత్యక్షంగా మమతా బెనర్జీ తొలిసారి సమావేశమయ్యారు. అయితే, తుఫాను సమీక్ష సమావేశానికి ప్రతిపక్ష నేత సువేందు అధికారిని కూడా పిలవడంతోనే మమతా బెనర్జీ ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని సమావేశానికి సీఎం హాజరుకాకపోవడం చీకటి రోజంటూ సువేందు అధికారి మండిపడ్డారు. ఎన్డీయేతర సీఎంలు ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నారని, కానీ, మమతకు మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని దుయ్యబట్టారు.
Recommended Video
యాస్ తుఫానుతో బెంగాల్, ఒడిశాలో భారీ నష్టం
కాగా, తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్, ఒడిశాలో భారీ నష్టం జరిగింది. బెంగాల్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సుమారు కోటి మందికిపైగా ప్రజలు తుఫాను ప్రభావానికి లోనయ్యారని మమతా బెనర్జీ చెప్పారు. 3 లక్షల ఇళ్లు, 134 ఆనకట్టలు దెబ్బతిన్నాయన్నారు. వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరోవైపు ఒడిశాలోనూ తుఫాను భారీ నష్టాన్ని కలిగించింది.












Click it and Unblock the Notifications