దావూద్ ‘అడ్రస్’ దొరికింది: ఐక్యరాజ్య సమితి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే తలదాచుకున్నాడని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందం నిర్దారించింది. దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు అనే విషయంలో ఐక్యరాజ్య సమితి నిగ్గు తేల్చింది.
పాకిస్థాన్ లో ఆరు ప్రాంతాల్లో దావూద్ ఇబ్రహీంకు ఇళ్లు ఉన్నాయని ఐకాస నిర్దారించింది. దావూద్ ఇబ్రహీంకు సంబంధించి భారత ప్రభుత్వం సమర్పించిన 9 చిరునామాల్లో ఆరు సరైనవేనని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందం తేల్చింది.
అందులో మూడు చిరునామాలు తప్పు అని ఐకాస తెలిపింది. ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలతో దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తుందని ఇంతకాలం భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరింది.

పాకిస్థాన్ లో దావూద్ ఇబ్రహీంకు సంబంధించి భారత నిఘా వర్గాలు కచ్చితమైన ఆధారాలు సేకరించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమాచారాన్ని పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి సర్తాజ్ అజీజ్ కు అందించారు.
అదే విధంగా ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందానికి సమాచారాన్ని చేరవేశారు. భారత్ ఇచ్చిన ఆధారాలను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందం క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేసి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని నిర్ధారించింది.
1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం మొదట దుబాయ్ పారిపోయాడు. తరువాత కరాచి చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతనికి పూర్తిగా సహకరిస్తున్నది.
దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని భారత్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో మా దేశంలో దావూద్ ఇబ్రహీం లేడని పాక్ ఇంతకాలం వాదించింది. ఇప్పుడు ఐకాస దావూద్ ఇబ్రహీం పాక్ లో ఉన్నాడని నిర్ధారించడంతో పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications