గ్యాంగ్‌రేప్ దోషి రివ్యూ పిటీషన్ కొట్టివేత: మైనర్ అనడానికి సాక్ష్యం ఏదన్న సుప్రీం:డమ్మీ ఉరితీత
Recommended Video
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు కామాంధులకు ఇక ఉరి తప్పక పోవచ్చు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురిలో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి పారేసింది. నిర్భయపై అత్యాచారానికి పాల్పడే సమయానికి తాను మైనర్‌నని, అయినప్పటికీ.. ఢిల్లీ న్యాయస్థానం గానీ, సుప్రీంకోర్టు గానీ.. ఈ విషయంలో తనకు అన్యాయం చేశాయంటూ పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటీషన్ ఇది.

ఇదివరకు ఎస్ఎల్‌పీని కొట్టేసిన సుప్రీం..
దీనిపై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎఎస్ బొపన్నతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే అంశంపై ఇదివరకు పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ (ఎస్ఎల్‌పీ)ని ఈ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే కొట్టి వేసింది. మరోసారి అదే బెంచ్ సమక్షానికి వెళ్లింది ఈ రివ్యూ పిటీషన్. పవన్ కుమార్ గుప్తా తరఫున న్యాయవాది అంజనా ప్రకాశ్ వాదనలను వినిపించారు.

17 సంవత్సరాలే..
అత్యాచారానికి పాల్పడే సమయానికి పవన్ కుమార్ గుప్తా వయస్సు 17 సంవత్సరాల ఒక నెల 20 రోజులు మాత్రమేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అతణ్ని బాల నేరస్తుడి (జువైనల్)గా పరిగణించాలని అన్నారు. నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆరుమందిలో ఒకడిని మైనర్‌గా గుర్తించారని, అదే నిబంధనలను పవన్ గుప్తాకు కూడా వర్తింపజేయాలని విజ్ఙప్తి చేశారు. దీనికితోడు అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

వాదనలను తిరస్కరించిన ధర్మాసనం..
పవన్ గుప్తా తరఫు న్యాయవాది వినిపించిన వాదనల్లో హేతుబద్ధత లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. పాత వాదనలనే మరోసారి వినిపించారని పేర్కొంది. ఇదివరకు తాము కొట్టేసిన పిటీషన్‌లోని అంశాలనే మళ్లీ వాదించారని పేర్కొంది. అత్యాచారానికి పాల్పడే సమయానికి అతను మైనరేననడానికి సరైన సాక్ష్యాధారాలను ఏవీ తమ సమక్షానికి తీసుకుని రాలేకపోయారని, పవన్ గుప్తా మేజరేననడానికి 2013లోనే ఢిల్లీ మేజిస్ట్రేట్ నిర్ధారించారని, దీనితో రివ్యూ పిటీషన్‌ను కొట్టి వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

డమ్మీ ఉరి పూర్తి..
తాజాగా సుప్రీంకోర్టు ఈ రివ్యూ పిటీషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో.. నలుగురు కామాంధులకు ఉరి శిక్ష విధించడానికి మార్గం సులభమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శనివారం తెల్లవారు జామున 6 గంటలకు ఆ నలుగురికీ ఉరి తీయడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు తీహార్ కేంద్ర కారాగారం అధికారులు. శుక్రవారం సాయంత్రం డమ్మీ ఉరితీతను కూడా నిర్వహించారు. ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. తీహార్‌లోని మూడో నంబర్ జైలులో ఈ నలుగురికీ ఉరికంబం ఎక్కించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications