లేడీ ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్: ముగ్గురికి ఉరిశిక్ష
ముంబై: ముంబై శక్తిమిల్స్ ఆవరణలో మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు ముగ్గురికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు దోషులకు సెషన్స్ కోర్టు ఈ మేరకు శుక్రవారం శిక్షను ఖరారు చేసింది. వరుస నేరాలకు పాల్పడుతున్న వారికి కోర్టు మరణశిక్ష విధించింది.
ముంబై సామూహిక అత్యాచారం కేసు నిందితులకు చట్టంపై కనీస గౌరవం లేదని, కేసు వాస్తవాలను పరిశీలిస్తే వారిని సంస్కరించడం కూడా సాధ్యం కాదని తెలుస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పడిన బాధ చెప్పనలవి కానిదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

చట్టాలను అమలు చేసే సంస్థలు తమను పట్టుకోలేవనే ధైర్యంతో నిందితులు వ్యవహరించారని అంటూ ఈ కేసులో మరణశిక్ష విధించకపోతే, మరే కేసులో విధించగలమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
విజయ్ జాదవ్, కాసీం బెంగాలీ, సలీం అన్సారీలకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వారికి జీవిత ఖైదు సరిపోదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిర్మానుష్యమైన శక్తి మిల్స్ ఆవరణలో ఆ ముగ్గురు ఓ టెలిఫోన్ ఆపరేటర్‌పై, మహిళా ఫొటో జర్నలిస్టులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నిరుడు ఆగస్టులో మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన అత్యాచారంతో నిందితుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా ఫొటో జర్నలిస్టు వార్తా సేకరణ కోసం తన మగ సహోద్యోగితో కలిసి శక్తిమిల్స్ ఆవరణకు వెళ్లింది. మగ సహోద్యోగిని ఐదుగురు వ్యక్తులు కట్టి పడేసి మహిళా జర్నలిస్టుపై దాడి చేశారు.












Click it and Unblock the Notifications