శిబిరాల్లో బాధితుల గోస: అఖిలేష్ గానా బజానా
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లలో నిరాశ్రాయులైన బాధితులు సహాయ శిబిరాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. అఖిలేష్ యాదవ్ మాత్రం తన స్వగ్రామంలో గానా బజానాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఏతవాహ్ జిల్లాలోని సెఫాయ్ గ్రామంలో మహోత్సవ్ పేరిట 14 రోజులపాటు జరిగే వేడుకలకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతేగాక ఈ వేడుకల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. సినిమా హీరోయిన్లు, డాన్యర్లను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి నృత్య ప్రదర్శనలు చేయించారు.

కాగా అల్లర్ల సహాయ శిబిరాల్లో సరైన వసతులు లేక, చలికి తట్టుకోలేక 34మంది చిన్నారులు చనిపోయి బాధితులు విషాదంలో ఉంటే.. ములాయం కుటుంబ సభ్యులు మాత్రం వేడుకల్లో పాల్గొనడం వివాదస్పదమైంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోపాటు మంత్రి అజాంఖాన్ కూడా హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ చర్యల పట్ల ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అల్లర్ల బాధితులకు సరైన ఏర్పాట్లు చేయలేని ప్రభుత్వం, వేడుకల పేరిట రూ. 200 కోట్లను ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా అఖిలేష్ యాదవ్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వేడుకలకు హాజరవడం గమనార్హం.












Click it and Unblock the Notifications