ఆలంను విడుదల చేయమని ఉత్తర్వులు ఇచ్చిందే హోం శాఖ.. తెలియదని రాజ్‌నాథ్ ఎలా అంటారు..?
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాది మసరాత్ ఆలం విడుదలపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారని విపక్షాలు మంగళవారం మండిపడ్డాయి.
మసరాత్ ఆలంను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది మహ్మద్ ముఫ్తీ ప్రభుత్వం కాదని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి జమ్మూ కోర్టుకు ఉత్తర్వులు అందాయని జాతీయ మీడియా టీవి ఛానెల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో పార్లమెంట్‌లో గందరగోళం ఏర్పడింది.

మసరాత్ ఆలం విడుదల ఉదంతంపై విపక్షాలు బీజేపీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశాయి. ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో, ప్రజా రక్షణ చట్టం కింద వేర్పాటువాదులను అరెస్ట్ చేసిన ఘటనల్లో నిర్ణీత సమయంలో రాష్ట్ర హోం శాఖ స్పందించకుంటే వారిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ పేరిట జమ్మూ కాశ్మీర్ జిల్లా న్యాయమూర్తికి ఈ ఉత్తర్వులు అందాయి. మార్చి 4న పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల అనంతరం మసారత్ నిర్భంధంపై హోం శాఖ స్పందించ లేదని తెలుపుతూ అతడిని విడుదల చేయాల్సిందిగా జిల్లా న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.

ఈ మొత్తం ఘటనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోందని, హోం మంత్రి రాజ్ నాత్ తెలియదని ఎలా చెప్తారని విపక్షాలు మండిపడ్డాయి. ఆలం విడుదలపై సోమవారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ మసరాత్ ఆలం విడుదలపై కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక మసారత్ ఆలం విడుదలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్ సభలో మాట్లాడుతూ ఆలం విడుదలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిందన్నారు. ఆలంపై 27 కేసులున్నాయని, 27 కేసుల్లో ఆలంకు బెయిల్ లభించిందని సభకు తెలిపారు. రెండేళ్లకు పైగా ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచరాదని కోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications