alok verma supreme court cvc congress kejriwal అలోక్ వర్మ సుప్రీంకోర్టు కాంగ్రెస్ అరవింద్ కేజ్రీవాల్
సీబీఐ వివాదం: సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్న విపక్షాలు
అలోక్ వర్మను తిరిగి సీబీఐ డైరెక్టరుగా విధుల్లోకి తీసుకోవాలని, సెలవుపై పంపడం సరికాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అలోక్ వర్మ, రాకేష్ అస్తానాలను ఇద్దరినీ సెలవుపై పంపించడం తాము చేసిన నిర్ణయం కాదని సీవీసీ సూచనల మేరకే ప్రభుత్వం అలా వ్యవహరించాల్సి వచ్చిందని జైట్లీ చెప్పారు.

ఇద్దరు అధికారులు తమ నిజాయితీని నిరూపించుకోవాలి
అలోక్ వర్మ, రాకేష్ అస్తనాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలోనే సీవీసీ రికమెండేషన్స్ మేరకు ఇద్దరినీ సెలవుపై పంపాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో అలోక్ వర్మ, రాకేష్ ఆస్తానాలు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని జైట్లీ అభిప్రాయపడ్డారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కూడా పారదర్శకంగా సాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని జైట్లీ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు మోడీ సర్కార్‌కు చెంపపెట్టులాంటిది: విపక్షాలు
ఇదిలా ఉంటే... సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ స్పందించింది. ఒక దేశ ప్రధాని ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కకు బెట్టడంతో మోడీ కొత్త చరిత్ర సృష్టించారని పేర్కొంది కాంగ్రెస్. అలోక్ వర్మను తిరిగి సీబీఐ డైరెక్టరుగా నియమించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన అనంతరం కాంగ్రెస్ స్పందించింది. మిగతా విపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్‌తో గొంతు కలిపాయి. మోడీ సర్కారుకు సుప్రీం తీర్పు చెంపపెట్టు లాంటిదని అభివర్ణించాయి. అతన్ని అధికారం నుంచి దూరం చేసి సెలవు పై పంపడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి.
ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి...పోతుంటాయి కాని రాజ్యాంగానికి లోబడి నడుచుకునే స్వయంప్రతిపత్తి కలిగిన స్వతంత్ర సంస్థలు మాత్రం అలానే ఉంటాయని మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే ఏమిటో ఈ తీర్పు ద్వారా మోడీ గుణపాఠం నేర్చుకోవాలని సూర్జేవాలా సూచించారు. మీరు ఎంత అన్యాయం చేయాలని చూసినప్పటికీ చివరకు న్యాయమే గెలిచిందని సూర్జేవాలా ట్వీట్ చేశారు.
దేశంలోని అన్ని వ్యవస్థలను మోడీ సర్కారు భ్రష్టు పట్టించింది
ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మోడీ సర్కార్ తప్పుచేసిందని స్పష్టమవుతోందని వెల్లడించారు. మోడీ సర్కారు దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. రాఫెల్ స్కామ్‌లో విచారణ చేస్తే ప్రధాని మోడీ ఎక్కడ దొరికిపోతారో అని చెప్పి అర్థరాత్రికే అలోక్ వర్మను సెలవుపై పంపడం నిజంకాదా అని ఆమ్‌ఆద్మీ పార్టీ ట్విటర్ ద్వారా ప్రశ్నించింది.

ఇది అలోక్ వర్మకు పాక్షిక విజయం
మరోవైపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు అలోక్ వర్మకు పాక్షిక విజయంగా ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ డైరెక్టరుగా తిరిగి బాధ్యతలు అప్పగించాలని చెప్పిన సుప్రీం.... విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ చెప్పడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇకపై వర్మ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక్క అపాయింట్‌మెంట్ కమిటీకి మాత్రమే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.